నలుగురు స్నేహితుల మధ్య చిచ్చుపెట్టిన గన్నవరం... ఇరకాటంలో పడిన యార్లగడ్డ పొలిటికల్ కెరియర్

 

కొడాలి నాని... వల్లభనేని వంశీ... వంగవీటి రాధాకృష్ణ... ఈ ముగ్గురూ మంచి స్నేహితులంటారు... ఈ ముగ్గురూ పార్టీలో ఉన్నా... పార్టీలకతీతంగా వీరి స్నేహం కొనసాగుతుందని చెప్పుకుంటారు. అయితే, ఇప్పుడో కొత్త సంగతి బయటికొచ్చింది. గన్నవరంలో వైసీపీ తరపున పోటీచేసి వంశీ చేతిలో ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావు కూడా... ఈ ముగ్గురికీ చిరకాల మిత్రుడని తెలిసింది. ఈ నలుగురూ మంచి స్నేహితులని, తరచూ కలిసికుని మాట్లాడుకుంటారని సన్నిహితులు చెబుతున్నారు. అయితే కొడాలి నాని... వల్లభనేని వంశీ... వంగవీటి రాధాకృష్ణ... స్నేహితులని అందరికీ తెలిసినా... యార్లగడ్డ సంగతే కొత్తగా ఉంది. అయితే, తన స్నేహితుడైన వల్లభనేని వంశీపై యార్లగడ్డ వెంకట్రావు పోటీకి దిగడానికి కొడాలి నానేయే కారణమనే మాట వినిపిస్తోంది.

ప్రవాస భారతీయుడుగా ఉన్న యార్లగడ్డను కొడాలి నానినే... ఆంధ్రాకి రప్పించి... జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్లడమే కాకుండా.... వల్లభనేని వంశీపై పోటీకి దింపారని అంటున్నారు. ఈ మాట... వల్లభనేని వంశీ కూడా చాలాసార్లు తన సన్నిహితులతో చెప్పుకొచ్చారు. రాజకీయంగా ఎవరు ఎత్తులు వాళ్లు వేసుకున్నా... వీళ్ల మధ్య మాత్రం స్నేహం... మాత్రం కంటిన్యూ అవుతోంది. అయితే, గన్నవరంలో ముఖాముఖిగా తలపడిన వంశీ, యార్లగడ్డ మధ్య పొరపొచ్చాలు వచ్చాయి. ఇక, రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం. సరిగ్గా ఇప్పుడదే జరిగింది.  

తొలుత వల్లభనేని వంశీ, కొడాలి నాని... ఇద్దరూ తెలుగుదేశంలోనే ఉన్నా... ఆ తర్వాత కొడాలి... వైసీపీలో చేరారు. వంశీ మాత్రం టీడీపీలో కొనసాగారు. వంగవీటి రాధా కూడా కొన్నాళ్లూ వైసీపీలోనే ఉన్నారు. ఈ ముగ్గురూ వేర్వేరు పార్టీల్లోనే ఉన్నా... వీళ్ల మధ్య స్నేహం మాత్రం కొనసాగింది. అయితే, మొన్నటివరకు అమెరికాలో ఉన్న యార్లగడ్డ వెంకట్రావు సరిగ్గా ఎన్నికల ముందు ఏపీకి ఎంట్రీ ఇచ్చి... గన్నవరం నుంచి బరిలోకి దిగి ఏకంగా స్నేహితుడైన వంశీనే ఢీకొట్టారు. అయితే స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఇక ఎన్నికల టైమ్ లో ఈ ఇద్దరికి మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి.

అది వ్యక్తిగత వైరంగానూ మారింది. అయితే, గెలిచిన తర్వాత కూడా వల్లభనేని వంశీని ఆర్ధిక సమస్యలు, కేసులు చుట్టుముట్టడంతో... తన స్నేహితుడైన కొడాలి నానితో పంచుకున్నట్లు తెలుస్తోంది. దాంతో కొడాలి... వల్లభనేని వంశీని జగన్ దగ్గరికి తీసుకెళ్లాడని చెప్పుకుంటున్నారు. ఇదిలాఉంటే, 2014 ఎన్నికల సందర్భంగా బెజవాడ బెంజ్ సర్కిల్ లో జగన్ ను వంశీ ఆలింగనం చేసుకోవడంతో... వీళ్లిదరి మధ్య సత్సంబంధాలు ఉన్నాయనే చర్చ జరిగింది. అంతేకాదు వంశీ వైసీపీలో చేరతానే ప్రచారం కూడా జరిగింది.

అయితే, ఈ నలుగురు చిరకాల స్నేహితుల్లో వంగవీటి రాధాకృష్ణ... మొన్నటి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండగా... కొడాలి నాని సూపర్ విక్టరీ కొట్టి జగన్ కేబినెట్ లో మంత్రిగా ఉన్నారు... ఇక వల్లభనేని వంశీ వైసీపీ గూటికి చేరతారనే ప్రచారం జరుగుతోంది. ఇంతవరకూ బాగానే ఉన్నా, ఎన్నికల ముందు స్నేహితుడినే ఢీకొట్టి వ్యక్తిగత వైరం తెచ్చుకున్న యార్లగడ్డ వెంకట్రావు పరిస్థితే ఇరకాటంలో పడిందని మాట్లాడుకుంటున్నారు. మరి, నలుగురి స్నేహితుల రాజకీయ అడుగులు ఎప్పుడు ఎటువైపు వెళ్తాయోనన్న చర్చ కృష్ణాజిల్లాలో జరుగుతోంది.