వంగవీటి రాధా ఓటు దేనికి.. ఎంపీకా? టీడీపీకా?

రాజకీయ భవితవ్యంపై వంగవీటి రాధా అంతర్మథనంలో పడ్డారు. విజయవాడ సెంట్రల్ సీటు ఇచ్చేదిలేదని చెప్పిన వైసీపీ అధిష్టానం నిర్ణయంపై మండిపడ్డ రాధా.. మూడు రోజుల్లో తన నిర్ణయం చెబుతానంటూ ప్రకటన చేసారు. ఇది జరిగి వారం, పదిరోజులు దాటింది. తాజాగా వైసీపీ అధిష్టానం నుండి కొందరు పెద్దలు రాధాకు సర్ధిచెప్పే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. ఎంపీగా పోటీకి దిగేందుకు మచిలీపట్నం అన్ని విధాల అనువుగా ఉన్నట్లు తమ సర్వేలో తేలిందని, వంగవీటి బ్రాండ్ ఇమేజ్ తూర్పు కృష్ణాలో బాగా వర్కౌట్ అవుతుందని నియోజకవర్గాల వారీగా లెక్కలేసి వివరించినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా మచిలీపట్నం ఎంపీగా పోటీకి సై అంటే ఎన్నికల ఖర్చు మొత్తం తామే భరిస్తామని అధిష్టానం భారీ ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం పార్టీకి రాష్ట్రంలో అనుకూల పవనాలు వీస్తున్నాయని ఇలాంటి తరుణంలో మంచి నిర్ణయం తీసుకోవాలని పార్టీ పెద్దలు రాధాకు సూచించినట్టు తెలుస్తోంది.

 


ఈ విషయంపై అంతరంగికులు, సన్నిహితులతో రాధా సుదీర్ఘ చర్చలు సాగించినట్లు తెలుస్తోంది. దశాబ్దాలుగా టీడీపీపై పోరాటం చేసాం. గతంలో ఆ పార్టీ నుంచి వచ్చిన ఆఫర్లను తిరస్కరించాం. ఇప్పుడు వైసీపీలో సెంట్రల్ సీటు రాలేదని పార్టీ మారి టీడీపీ నుంచి సెంట్రల్ సీటుకు పోటీ చేస్తే ఓటు అడగటం కష్టంగా ఉంటుందని పలువురు సన్నిహితులు తమ అభిప్రాయాలను వెల్లడించినట్టు సమాచారం. ఇప్పటిదాకా వంగవీటి బ్రాండ్ ఇమేజ్ ను కాపాడుకుంటూ వస్తున్నాం. మనల్నే నమ్ముకున్న ప్రజలు ఉన్నారు. కాబట్టి వాళ్ళ మనోభావాలను పరిగణలోకి తీసుకొని రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకుంటే మంచిదనే సలహాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. తమ కుటుంబానికి టీడీపీతో ఉన్న వైరం, ఫ్లాష్ బ్యాక్ లో చోటు చేసుకున్న వర్గపోరు తదితర కారణాల దృష్ట్యా రాధా ఆలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. 2019 ఎన్నికల్ని అత్యంత కీలకంగా భావిస్తున్న రాధా ఎక్కడ నుంచి పోటీ చేయాలి? ఎలా గెలవాలి? అనే దానిపై ఆలోచనలో పడ్డారు. కాబట్టి కొద్దిరోజులు సైలెంట్ గా ఉండి రాజకీయ సమీకరణాల్ని బేరీజు వేసే పనిలో పడ్డట్టు సమాచారం. గెలుపే లక్ష్యంగా రాధా నిర్ణయం ఉంటుందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. తాజా పరిణామాల క్రమంలో రాజకీయ భవితవ్యంపై రాధా ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటారనేది తేలాలంటే కొద్దిరోజులు ఓపిక పట్టాల్సిందే.