వంగవీటి రాధా దారెటు?

 

విజయవాడ వైసీపీ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.. విజయవాడ సెంట్రల్‌ అసెంబ్లీ టిక్కెట్ ఆశిస్తున్న వంగవీటి రాధాకు వైసీపీ అధినాయకత్వం మొండి చెయ్యి చూపింది.. రాధా స్థానంలో ఆ టిక్కెట్ ను మల్లాది విష్ణుకు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.. ఈ నిర్ణయమే ఇప్పుడు విజయవాడ వైసీపీలో అలజడి సృష్టిస్తుంది.. రాధా తనకు సెంట్రల్ టిక్కెట్ కావాల్సిందేనని పట్టుబడుతుండగా, వైసీపీ అధినాయకత్వం మాత్రం సెంట్రల్ టిక్కెట్ ఇచ్చేది లేదని తేల్చి చెప్తూ.. రాధా ముందు రెండు ఆప్షన్లు ఉంచింది.. విజయవాడ తూర్పు నుంచి లేదా బందరు పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయాలని రాధాకు సూచించింది.. అయితే రాధా మాత్రం ఈ రెండు స్థానాలలో పోటీ చేసేందుకు సుముఖంగా లేరు.. ఇంతకాలం సెంట్రల్ టిక్కెట్ వస్తుందని ఆశతో గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తుంటే, ఇప్పుడిలా మొండి చెయ్యి చూపడంతో.. రాధాతో పాటు ఆయన అనుచరులు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.. మరోవైపు ఇదంతా రాధాను పార్టీ నుంచి పొమ్మనకుండా పొగబెట్టే కార్యక్రమమని కొందరు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. జరుగుతున్న ఈ పరిణామాల నేపథ్యంలో రాధా భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతోందన్న అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

 

 

రాధా వర్గీయులు కొందరు ఆయనకి పార్టీ మారమని సూచించినట్టు కూడా తెలుస్తోంది.. దీంతో రాధా వైసీపీని వీడతారా?.. ఒకవేళ వీడితే ఏ పార్టీ గూటికి చేరతారు? చర్చలు మొదలయ్యాయి.. ఆయన ముందు ప్రధానంగా రెండు ఆప్షన్లు ఉన్నాయి.. ఒకటి టీడీపీ, రెండు జనసేన.. ప్రస్తుతం ఏపీలో టీడీపీ అధికారంలో ఉంది, అలాగే విజవాడలో బలంగా ఉంది.. దీంతో కొందరు ఆయనకు టీడీపీలో చేరమని సూచిస్తున్నట్టు తెలుస్తోంది.. అయితే రాధా టీడీపీ చేరే అవకాశాలు తక్కువని విశ్లేషకులు భావిస్తున్నారు.. దానికి పలు కారణాలు ఉన్నాయి.. రాధా సెంట్రల్ సీటుని పట్టుబడుతున్నారు.. అయితే సెంట్రల్ నుండి టీడీపీ నుండి బోండా ఉమా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.. ఉమాని తప్పించి రాధాకు టిక్కెట్ ఇచ్చే అవకాశం లేదు.. అదీగాక వంగవీటి కుటుంబం మొదటినుండి టీడీపీకి వ్యతిరేకం.. వీటిని బట్టి చూస్తుంటే రాధా టీడీపీలో చేరే అవకాశం లేదు.. ఇక రెండో ఆప్షన్ జనసేన.. జనసేనలో పవన్ కళ్యాణ్ తప్ప బలమైన నేతలు లేరు.. జనసేనలో చేరితే విజయవాడలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉండొచ్చు అలాగే కోరుకున్న సెంట్రల్ టిక్కెట్ వచ్చే అవకాశముంది.. దీంతో రాధా జనసేన వైపే మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది.. మెజారిటీ అనుచరులు కూడా జనసేన వైపే అడుగులు వేయమని చెప్తున్నారట.. మరి సెంట్రల్ టిక్కెట్ విషయంలో అసంతృప్తిగా ఉన్న రాధా నిజంగానే వైసీపీని వీడి జనసేనలో చేరతారా?.. తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.