అవనిగడ్డ వైపు చూస్తోన్న వంగవీటి రాధా

వంగవీటి రాధా... మాజీ ఎమ్మెల్యేగా కంటే వంగవీటి రంగా కుమారుడిగానే ఫేమస్‌. మూడుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన రాధా... రెండుసార్లు ఓటమి పాలయ్యాడు. మూడుసార్లూ కూడా మూడు పార్టీల నుంచి పోటీ చేశాడు. అయితే ఏ పార్టీలోనూ ఇమడలేకపోయాడనే విమర్శలు ఉన్నాయి. కాంగ్రెస్‌ తరపున పోటీచేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రాధా, ఓ స్థలం విషయంలో అప్పటి సీఎం వైఎస్‌కు చికాకు తెప్పించారు. అనంతరం కాంగ్రెస్‌ను వీడి, ప్రజారాజ్యం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే విజయవాడ సెంట్రల్‌ నుంచి పీఆర్పీ తరపున పోటీకి దిగిన రాధా ఓటమి పాలయ్యారు. ఇక 2014లో వైసీపీ నుంచి బరిలోకి దిగినా మరోసారి పరాజయం తప్పలేదు. 

 

వైసీపీలో కీలక నేతగా ఎదుగుతారని భావించినా, వంగవీటి రాధా ప్రస్తుతం స్తబ్ధుగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. నవ్యాంధ్ర రాజధాని ప్రాంతం బెజవాడలో ఆశించిన స్థాయిలో రాణించడం లేదని భావించిన వైసీపీ అధినాయకత్వం.... రాధా ప్రాధాన్యతను తగ్గించిందనే టాక్ వినిపిస్తోంది. వైసీపీ రాష్ట్ర యువజన విభాగం, విజయవాడ నగర అధ్యక్ష పదవులతో రాధాను జగన్‌ ప్రోత్సహించినా, పార్టీని ముందుకు తీసుకెళ్లడంతో ఆశించినమేర రాణించడం లేదనే విమర్శలు ఉన్నాయి. అందుకే వెల్లంపల్లికి నగర అధ్యక్ష పదవి ఇచ్చి, రాధాను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించారని అంటున్నారు. రాధా వల్ల పార్టీకి, పార్టీ వల్ల రాధాకి ఉపయోగం జరిగేలా అధినాయకత్వం దిశానిర్దేశం చేస్తున్నా, రాధా మాత్రం స్తబ్ధుగా ఉంటున్నారనే విమర్శలు ఉన్నాయి. అయితే ఇటీవల పార్టీలో చేరిన వెల్లంపల్లికి విజయవాడ నగర వైసీపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించడంతో రాధా రగిలిపోతున్నట్లు తెలుస్తోంది, అదే సమయంలో తనతో విభేదాలున్న మల్లాది విష్ణు కూడా త్వరలో వైసీపీలో చేరతాడన్న ప్రచారం జరుగుతుండటంతో రాధా తీవ్ర అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది.

 

ప్రస్తుతం రాధా రాజకీయంగా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. రెండుసార్లు వరుసగా ఓటమి పాలైన రాధా ...ఈసారి గెలవాల్సిన పరిస్థితి. అయితే తన కంచుకోట విజయవాడ ఈస్ట్‌ను వదులుకుని రాధా పెద్ద తప్పు చేశారని, గత ఎన్నికల్లో తప్పు తెలుసుకుని ఇక్కడ్నుంచి పోటీ చేసినా ఓటమి పాలవడం మరింత కుంగదీసిందంటారు. కానీ ఈసారి తప్పకుండా గెలివాల్సిన పరిస్థితి ఏర్పడటంతో అవనిగడ్డ నుంచి పోటీకి దిగుతారనే ప్రచారం జరుగుతోంది.

 

మరోవైపు వంగవీటి రాధా జనసేన పార్టీలోకి వెళ్తారనే టాక్‌ వినిపిస్తోంది. అయితే రాధా వర్గం నుంచి దీనిపై ఎలాంటి సమాధానం రావడం లేదు. పీఆర్పీలో చేరి గతంలో ఇబ్బందిపడ్డ రాధా, జనసేన వైపు అడుగులేస్తారో లేదో చెప్పలేమంటున్నారు అనుచరులు. అదే సమయంలో వైసీపీ తగిన ప్రాధాన్యత ఇస్తుండటంతో.... రాధా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్నది ఆసక్తికరంగా మారింది.