TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రాజీనామా చేస్తే బెదిరింపులా..జగన్ పద్ధతి మార్చుకో

Published on: Thu Jan 24, 2019 12:25PM

 

వంగవీటి రంగా ఆశయ సాధన కోసమే వైసీపీలో చేరానని, కానీ అది అక్కడ సాధ్యం కాకపోవడంతో బయటకు వచ్చేశానని వంగవీటి రాధా తెలిపారు. విజయవాడలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... రంగా ఆశయం నెరవేరుస్తానని పార్టీలో చేరేటప్పుడు వైసీపీ అధినేత జగన్ మాటిచ్చారని.. సొంత తమ్ముడికన్నా ఎక్కువ అన్నారని రాధా చెప్పారు. 'తమ్ముడినే ఇలా చూస్తే.. సామాన్య ప్రజలను జగన్‌ ఎలా చూస్తారు' అని ప్రశ్నించారు.  'ఒక్క సీటు కోసం నాకు ఈ గొడవ అవసరం లేదు. నేను అభిమానం కోరుకున్నా.. మీరు జాలి చూపిస్తున్నారు. సీటు ఇవ్వనందుకు నాకు బాధ లేదు, సూటిపోటి మాటలు నన్ను బాధించాయి' అని రాధా అన్నారు.

వైసీపీలో తనకు జరిగిన అవమానాలు మరొకరికి ఎదురుకాకూడదన్నారు రాధా. తన తండ్రి విగ్రహావిష్కరణకు వెళితే.. ఎందుకు వెళ్లావంటూ వైసీపీ నేతలు తనను మందలించారన్నారు. ఇదెక్కడి న్యాయమన్నారు. రంగా విగ్రహావిష్కరణకు అన్ని రకాల పార్టీల వాళ్లు వస్తారని... ఆయన అభిమానానికి హద్దులు లేవన్నారు. తన తండ్రి విగ్రహావిష్కరణకు ఎవరి అనుమతి అవసరం లేదని చెప్పారు. అభిమానంతో కొంతమంది భోజనాలు పెడితే.. అది కూడా పొరపాటైపోయిందన్నారు. లోకల్ ఇంఛార్జీకి చెప్పలేదని.. తనను ప్రశ్నించారన్నారు. తండ్రి లేనివాడినని చేరదీశానని.. చెప్పినట్లు వినాల్సిందేనంటూ జగన్‌ ఒత్తిడి చేసేవారని రాధా ఆరోపించారు. ఇప్పటికైనా జగన్‌ పద్ధతి మార్చుకోవాలని సూచించారు.

వైసీపీని వీడిన తర్వాత సోషల్ మీడియాలో తనపై బెదిరింపులు పెరిగాయని వంగవీటి రాధా అన్నారు. ఒకవేళ తన చావు వారికి ఆనందం కలిగిస్తుందంటే చంపేయండని అన్నారు. తనకు ప్రాణం మీద ఆశ లేదని.. పేదల కోసం పోరాడి ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి తన తండ్రి అని.. తాను కూడా అందుకు సిద్ధమేనని చెప్పారు. 'నన్ను బెదిరిస్తున్నవారి ఐపీ అడ్రస్‌ ద్వారా గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయగలను. కానీ.. వైసీపీ నేతలు కింద వారిని బలి చేస్తారనే ఆగిపోయాను. ఏపీ పోలీసుల మీద నాకు నమ్మకం ఉంది' అని రాధా అన్నారు. అలాగే పార్టీ మారేందుకు వంద కోట్ల డీల్ కుదుర్చుకున్నారన్న వార్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.