కొత్త ట్విస్ట్.. కొడాలి నాని, వంగవీటి రాధా భేటీ

 

వంగవీటి రాధా కొద్దిరోజుల క్రితం వైసీపీని వీడిన సంగతి తెలిసిందే. తర్వాత ఆయన టీడీపీలో చేరాలని అనుకున్నారు. కానీ.. కొన్ని కారణాల వల్ల ఏ పార్టీలో చేరకుండా ఉండిపోయారు. వైఎస్ జగన్ ఓటమి కోసం తాను పని చేస్తానని ఇప్పటికే రాధా స్పష్టం చేసారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా వంగవీటి రాధతో.. వైసీపీ నేత, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని భేటీ అయ్యారు. గుడివాడలో స్థానిక ఏలూరు రోడ్డులోని ఫర్నిచర్‌ పార్క్‌లో నాని, రాధా భేటీ అయ్యారు. అయితే రాధాతో నాని భేటీ అయింది.. తిరిగి వైసీపీలోకి రమ్మని ఆహ్వానించడానికి కాదు, రాబోయే ఎన్నికల్లో తనకి మద్దతివ్వమని అడగడానికి అని తెలుస్తోంది.

వచ్చే ఎన్నికల్లో కొడాలి నానికి పోటీగా టీడీపీ.. దేవినేని అవినాష్ ని బరిలోకి దింపుతోంది. నానికి చెక్ పెట్టి ఒకప్పుడు తమ పార్టీకి కంచుకోట అయిన గుడివాడలో తిరిగి జెండా ఎగురవేయాలని టీడీపీ భావిస్తోంది. అందుకే కృష్ణ జిల్లాలో మంచి పట్టున్న దేవినేని కుటుంబానికి చెందిన అవినాష్ ని టీడీపీ అధిష్టానం బరిలోకి దింపింది. ఈసారి నానికి గుడివాడలో గట్టిపోటీ తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో అలెర్ట్ అయిన నాని.. ఎలాగైనా గెలవాలని.. కాపు ఓట్లు తన వైపు తిప్పుకునేందుకు పావులు కదుపుతున్నారు.  గుడివాడ నియోజకవర్గంలో కాపు సామాజికవర్గం ఓట్లు 24 వేలకు పైగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. వంగవీటి రాధా మద్దతుతో ఈ ఓట్లు తన ఖాతాలో వేసుకోవాలని నాని భావిస్తున్నారు. అందుకే నాని రాధాతో భేటీ అయి మద్దతు కోరినట్లు తెలుస్తోంది. నానితో జరిగిన భేటీలో రాధా వెంట ఆయనకు అత్యంత సన్నిహితులైన కాపు నాయకులు ఉన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ అడపా వెంకటరమణ (బాబ్జీ), పాలేటి చంటి, ఎంవీ నారాయణరెడ్డి, కొడాలి నాగేశ్వరరావు (చిన్ని), మాజీ కౌన్సిలర్‌ పొట్లూరి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. నాని, రాధా మొదటి నుండి సన్నిహితంగా ఉండేవారు. మరి వైసీపీని వీడిన రాధా.. వైసీపీ తరపున బరిలోకి దిగుతున్న తన మిత్రుడు నానికి మద్దతిస్తారో లేదో చూడాలి.