TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

గోదావరిలో కొట్టుకుపోయిన అమ్మవారి ఆలయం

Published on: Sat Jul 30, 2022 9:54AM

గోదావరి వరదలకు ఒక ఆలయం కొట్టుకుపోయింది. వరద ఉదృతికి ఆలయం మొత్తం నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అయ్యాయి. గతంలో విదేశాలలో వరద ప్రవాహంలో పడవల్లా భవంతులకు భవంతులు కొట్టుకు పోతున్న దృశ్యాలను టీవీలలో చూసి వరద ఇంత పని చేస్తుందా అనుకున్నాం. వరద అంటే ఊళ్లూ పూళ్లూ మునిగిపోవడం, గొడ్డూ గొదా కొట్లుకుపోవడం తెలుసు.

ప్రవాహంలో చిక్కుకుని వాహనాలు కొట్టుకు పోవడం, మనుషులూ పశువులూ గల్లంతవడం విన్నాం. ఇలా ఒక ఆలయం నీటిలో కొట్టుకుపోవడాన్ని వినడం, వీడియోల ద్వారా చూడటం దాదాపుగా ఇదే ప్రథమం కావచ్చు.

ఈ సంఘటన ఎక్కడో కాదు ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. సీతానగరం మండలం పురుషోత్త పట్నం నది ఒడ్డున ఉన్న ఆలయం వనదుర్గ ఆలయం. ఈ ఆలయాన్ని దాదాపు 15 ఏళ్ల కిందట నిర్మించారు. నిత్య పూజలందుకునే ఈ ఆలయంలో వన దుర్గమ్మ వారు శక్తిమంతమైన దేవతగా అక్కడి వారు విశ్వసిస్తారు.  

తొలి శ్రావణ శుక్రవారం కావడంతో ఈ ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఇటీవలి వర్షాలకు ఆలయం వరకూ నీరు చేరింది. దీంతో భక్తులు చాలా జాగ్రత్తగా ఆలయానికి వచ్చారు. గోదావరి వరద ఉధృతికి తీరం కోతకు గురి కావడంతో ఆలయం ఒక పక్కకు ఒరిగిపోయింది. దీనిని గమనించిన స్థానికులు మధ్యాహ్నం నుంచే ఆలయంలోనికి ఎవరినీ అనుమతించలేదు. సాయంత్రం అయ్యే సరికి ఆలయం ఒక్కసారిగా నదీలోకి జారిపోయి కొట్టుకుపోయింది. ఆ సమయలో గ్రామస్తులు వీడియోలు తీసుకున్నారు. అవే ఇప్పుడు సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యాయి.