TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వంశీ ఖేల్‌ ఖ‌తం.. గ‌న్న‌వ‌రంలో ఆ రెడ్డిదే రాజ్యం!

Published on: Mon Mar 21, 2022 2:36PM

చేసుకున్నవాడికి చేసుకున్నంత మహాదేవ అన్నట్లుగా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పరిస్థితి తయారైందట. ఈ మేరకు సదరు నియోజకవర్గంలో ఓ టాక్ అయితే మస్త్ మస్త్‌గా నడుస్తోంది. తనకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన సైకిల్ పార్టీపై ఎన్నికల్లో గెలిచి.. ఆ తర్వాత ఫ్యాన్ పార్టీలో చేరి... టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపైనే కాకుండా.. ఆయన భార్యపై కూడా పలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారీ వల్లభనేని వంశీ. ఈ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలపై నాడు ఎంత చర్చ జరిగిందో అంత రచ్చ కూడా జరిగింది. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇటీవల సీఎం వైయస్ జగన్.. పార్టీ ఎమ్మెల్యేలంతా జనంలోకి వెళ్లాలని ఆదేశించిన విషయం విధితమే. మరి  జగన్ పార్టీలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలూ ఉన్నారు… వారి పరిస్థితి అంతా అయోమయం జగన్నాథమన్నట్లుగా తయారైందట. 

గన్నవరం నియోజకవర్గంలోని ఫ్యాన్ పార్టీ కేడర్‌.. సదరు ఎమ్మెల్యే వంశీ నాయకత్వాన్ని అంగీకరించడం లేదట. వంశీకి నియోజవర్గ బాధ్యతలు అప్పగించవద్దంటూ.. ఆ పార్టీలో కీలక నేత, వివిధ విభాగాల ఇన్‌ఛార్జ్ విజయసాయిరెడ్డికి కేడర్ ఏకంగా చాంతాడంత లేఖ రాసిందట. నియోజకవర్గంలో ఫ్యాన్ పార్టీని దాదాపు తొమ్మిదేళ్లుగా కోట్లాది రూపాయిలు ఖర్చు చేసి మరీ కాపాడుకొంటున్నామని ఈ లేఖలో కేడర్ స్పష్టం చేసిందట. నియోజకవర్గ బాధ్యతలు.. వంశీకి కాకుండా మరేవరికి అప్పగించినా.. తమకు ఓకే అని.. రానున్న ఎన్నికల్లో ఆ అభ్యర్థికి 30 వేల ఓట్ల మెజారీటి వచ్చేలా కృషి చేస్తామని కూడా ఆ లేఖలో కేడర్..  క్లియర్ కట్‌గా పేర్కొందట. అయితే ఈ లేఖ సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడంతో... సదరు నియోజకవర్గంలో చోటు చేసుకొంటున్న పరిణామాలపై పార్టీ అగ్రనేతలు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. 

మరోవైపు.. గన్నవరం నియోజకవర్గంలో బీసీ నేత డాక్టర్ దుట్టా రామచంద్రరావుకు మంచి పట్టుందీ. అదీకాక.. వంశీకి దుట్టా రామచంద్రరావుకి మధ్య రాజకీయంగా వైరం ఉంది. ఇంకోవైపు డాక్టర్ దుట్టా... తన కుమార్తెను సీఎం వైయస్ జగన్ భార్య వైయస్ భారతీ రెడ్డి సమీప బంధువు శివభరత్‌రెడ్డికి ఇచ్చి వివాహం చేశారు. ఆయన గతంలో హైదరాబాద్‌లో ఆస్పత్రి నిర్వహిస్తు ఉండేవారు. కానీ శివభరత్ రెడ్డి... తన రాజకీయ భవిష్యత్తు కోసం ఆ తర్వాత గన్నవరం వచ్చేసి.. తనదైన శైలిలో అన్ని విధాల దూకుడుగా దూసుకుపోతున్నారు. దీంతో ఫ్యాన్ పార్టీలోని మెజార్టీ వర్గమంతా శివభరత్‌రెడ్డి వైపునకు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. 

అదీకాక నియోజకవర్గంలో అధికారులు సైతం శివభరత్ రెడ్డి మాటలే వింటున్నారట. వంశీ వర్గం చేస్తున్న పనులన్నీటిని కూడా ఈ వర్గం వ్యూహాత్మకంగా లాగేసుకొంటుందని సమాచారం. చివరకు ఈ పంచాయతీ జిల్లా కలెక్టర్‌ వద్దకు చేరడం.. ఆయన కూడా శివభరత్ రెడ్డి వైపే మొగ్గు చూపడం అంతా అటోమెటిక్‌గా జరిగిపోయిందట. దీంతో శివభరత్ రెడ్డి వైపు.. క్యాడర్ అంతా వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఆ విధంగా వంశీకి చెక్ పెట్టి.. తన అల్లుడికీ రానున్న ఎన్నికల్లో టిక్కెట్ ఇప్పించుకుని... అతడిని అసెంబ్లీలో అడుగు పెట్టించేందుకు డాక్టర్ దుట్టా వారు.. తన చాణక్యానికి పదును పెట్టినట్లు.. ఆ క్రమంలోనే విజయసాయిరెడ్డికి కేడర్ చేత లేఖ పోస్ట్ చేయించినట్లు ఓ టాక్ అయితే నియోజకవర్గంలో నడుస్తోంది. 

అంతేకాకుండా.. చంద్రబాబు.. ఆయన భార్యపై వ్యాఖ్యలు చేసి... వంశీ తప్పు చేశారనే భావన.. సైకిల్ పార్టీలోనే కాకుండా.. అధికార ఫ్యాన్ పార్టీలో కూడా చాలా బలంగా ఉందట. అలాంటి పరిస్థితిలో.. వంశీ జనంలోకి వెళ్లితే.. పార్టీకి దెబ్బ అలా ఇలా కాదు.. ఓ రేంజ్‌లో పడుతోందనే వాదన అధికార పార్టీలో గట్టిగానే వినిపిస్తోందట. 

ఇక రానున్న ఎన్నికల్లో వల్లభనేని వంశీని ఎలాగైనా ఓడించాలని చంద్రబాబు కంకణం కట్టుకున్నారని.. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గం నుంచి గద్దె రామ్మోహన్‌ను తమ ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలోకి దింపాలని ఇప్పటికే టీడీపీ బాస్ డిసైడ్ అయినట్లు సమాచారం. 

అలాంటి పరిస్థితుల్లో రానున్న ఎన్నికల్లో ఏ పార్టీ అభ్యర్థిగా వంశీ బరిలోకి దిగుతాడు?.. లేక.. వంశీ రాజకీయాలకు గుడ్ బై చెబుతాడా? లేక యు టర్న్ తీసుకుని వంశీ టీడీపీలోకి వెళ్లిపోతాడా? లేక వంశీ తన కుటుంబ సభ్యులను ఎన్నికల బరిలోకి దింపి.. తాను వెనుక ఉండి చక్రం తిప్పుతాడా? అనే ప్రశ్నలు సదరు నియోజకవర్గ ప్రజలను తొలి చేస్తున్నాయి. వల్లభనేని వంశీ కూడా తాజా పరిణామాల నేపథ్యంలో అతడి పరిస్థితి కక్క లేక మింగ లేక అన్నట్లుగా తయారైందనీ ఆయన అనుచరులే పేర్కొంటున్నారు. ఏదీ ఏమైనా రానున్న రోజులు.. వంశీ పోలిటికల్ లైఫ్‌ను డిసైడ్ చేస్తాయనే ఓ చర్చ కూడా గన్నవరం నియోజకవర్గంలో చాలా బలంగా సాగుతోంది.