TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జైలు నుంచి ఆస్పత్రికి.. ఆస్పత్రి నుంచి జైలుకు!

Published on: Tue Jun 3, 2025 4:24PM

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నాయకుడు వల్లభనేని వంశీని మళ్లీ విజయవాడ జిల్లా జైలుకు చేరుకున్నారు. ఆనారోగ్యం కారణంగా ఇటీవల వంశీకి కోర్టు మధ్యంతర బెయిలు మంజూరు చేసి మెరుగైన వైద్య చికిత్స అందించాల్సిందిగా ఆదేశించిన సంగతి తెలిసిందే.    ఈ మధ్యంతర బెయిల్ ఆసుపత్రిలో చికిత్స వరకే కొనసాగుతుందని, చికిత్స పూర్తి కాగానే రద్దు అవుతుందని అప్పుడే  కోర్టు స్పష్టం చేసింది. అంతే కాకుండా  వైద్య పరీక్షలకు సంబంధించిన నివేదికను జూన్ 5లోగా   సీల్డ్ కవర్ లో అందించాలని కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో వంశీని  విజయవాడలోని ఆయుష్ ఆస్పత్రికి జైలు అధికారులు తరలించారు.  

దళిత యువకుడి కిడ్నాప్, గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి, భూకబ్జాలు, నకిలీఇళ్ల పట్టాల పంపిణీ, అక్రమ మైనింగ్… ఇలా పలు కేసులలో వల్లభనేని వంశీ నిందితుడిగా కేసులు ఎదుర్కొంటున్న సంగతి విదితమే.  కిడ్నాప్ కేసులో అరెస్టు అయిన వంశీ…ఆ తర్వాత ఈ కేసులనూ ఎదుర్కోక తప్పలేదు. ఒక కేసులో బెయిల్ వస్తే… మరో కేసులో రిమాండ్ పొడిగించడం వంటి కారణాలతో వంద రోజులకు పైగానే వంశీ బెజవాడ జైలులో రిమాండ్ ఖైడీగా ఉంటున్నారు. ఈ క్రమంలో  అనారోగ్యానికి గురైన వంశీ వైద్యం చేయించుకునేందుకు బెయిలు ఇవ్వాలంటూ కోర్టును ఆశ్రయించారు.  వంశీ పిటిషన్ ను విచారించిన ఏపీ హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిలు మంజూరు చేసింది.

దీంతో ఆయనను జైలు నుంచి డిశ్చార్జ్ చేసిన జైలు అధికారులు విజయవాడలోని ఆయుష్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ మూడు రోజుల పాటు చికిత్స పొందిన వంశీ సోమవారం (జూన్ 2) సాయంత్రం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కోర్టు ఆదేశాల మేరకు జైలు అధికారులు వంశీని ఆస్పత్రి నుంచి జైలుకు తరలించారు.  ఇక ఆయుష్ ఆస్పత్రి  వైద్యులు వంశీ ఆరోగ్యానికి సంబంధించిన సమగ్ర నివేదికను గురువారం (జూన్ 5) కోర్టుకు అందించనున్నారు.