గన్నవరం కోసం తెలుగు తమ్ముళ్ళ పోరు

 

వచ్చేఎన్నికలలో తనకే విజయవాడ లోక్ సభ టికెట్ ఇస్తారని భావించిన వల్లభనేని వంశీ నుండి చంద్రబాబు ఆయన నిర్వహిస్తున్న తెదేపా అర్బన్ అధ్యక్ష పదవి నుండి తప్పించి దానిని కేశినేని నాని అనుచరుడికి, విజయవాడ లోక్ సభ టికెట్ కేశినేని నానికి కేటాయించారు. అందుకు ప్రతిగా తనకు కృష్ణాజిల్లాలో గన్నవరం శాసనసభ టికెట్ ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరించారని వంశీ చెప్పుకొంటున్నారు. అయితే ఈ విషయం చంద్రబాబు ఎన్నడూ కూడా దృవీకరించలేదు. కొద్ది రోజుల క్రితం వంశీ తాను వచ్చే ఎన్నికలలో గన్నవరం నుండి శాసనసభకు పోటీ చేయబోతున్నట్లు పునరుద్ఘాటించారు.

 

గన్నవరం సిట్టింగ్ శాసనసభ్యుడు దాసరి బాలవర్దనరావు వంశీ మాటలకు ప్రతిస్పందిస్తూ, “సిట్టింగ్ శాసనసభ్యుడనయినా నన్నుకాదని, నాకు తెలియకుండా చ౦ద్రబాబు నా సీటుని వేరెవరికో ఎలా కేటాయిస్తారు? చంద్రబాబు గన్నవరం సీటు నాకే ఇస్తారని పూర్తి నమ్మకం ఉంది. అందువల్ల వచ్చే ఎన్నికలలో కూడా నేను గన్నవరం నుండే పోటీ చేయబోతున్నాను. వంశీ ఆ విధంగా ఎందుకు ప్రచారం చేసుకొంటున్నారో నాకు తెలియదు. కానీ ఆయన చేసుకొంటున్నప్రచారం వలన నా నియోజకవర్గ ప్రజలలో, కార్యకర్తలలో చాలా గందరగోళం, అపోహలు ఏర్పడుతున్నాయి. త్వరలో నేను చంద్రబాబుని కలిసి ఈ విషయమై స్పష్టమయిన హామీ తీసుకొంటాను,” అని అన్నారు.

 

వంశీని అర్బన్ అధ్యక్ష పదవి నుండి తప్పించినపుడు ఆయన వైకాపా లోకి వెళ్లిపోతారని వచ్చిన వార్తలను ఖండిస్తూ “ఒకవేళ వచ్చే ఎన్నికలలో నాకు పార్టీ గన్నవరం శాసనసభ టికెట్ ఈయకపోయినట్లయితే రాజకీయాలకు స్వస్తి చెప్పి వ్యవసాయం చేసుకొంటాను తప్ప వేరే పార్టీలో చేరను,” అని ఆయన అన్నారు. ఇప్పుడు బాలవర్దనరావు గన్నవరం వదలనని చెపుతుండటంతో వంశీ పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చినట్లయింది. ఒకవేళ వంశీ కూడా గన్నవరం కోసమే పట్టుబట్టినట్లయితే చంద్రబాబు ఈ సమస్యను ఏవిధంగా పరిష్కరిస్తారో వేచి చూడాలి,