మనిషి విలువ ఎంత


ఓ కుర్రవాడికి హఠాత్తుగా సందేహం వచ్చింది. ఆ సందేహం అతన్ని నిలవలనీయలేదు, కూర్చోనీయలేదు. ‘మనిషి విలువ ఏమిటి?’ అన్నదే అతని సందేహం. తన ప్రశ్నకి జవాబు తాతయ్య దగ్గరే ఉంటుందనిపించింది ఆ కుర్రవాడికి. వెంటనే తాతయ్య దగ్గరకి పరుగుపరుగున వెళ్లాడు. ‘తాతయ్యా! తాతయ్యా! మనిషి విలువ, మనిషి విలువ అంటూ ఉంటారు కదా! అసలు మనిషి విలువ ఏమిటి?’ అని అడిగాడు.

 

కుర్రవాడి ప్రశ్నకి తాతగారు ఏమీ మాట్లాడలేదు కానీ చిరునవ్వుతో తన గదిలో ఉన్న బీరువాలోంచి ఒక రాయిని తీసి కుర్రవాడి చేతిలో పెట్టారు. ‘ఈ వీధిలో ఉన్న దుకాణాల దగ్గరకి వెళ్లి, ఈ రాయి విలువ ఏమిటో ఒకొక్కరినీ అడిగి చూడు. కానీ పొరపాటున అమ్మవద్దు,’ అన్నారు.

 

ఎర్రగా తళతళా మెరిసిపోతున్న ఆ రాయిని తీసుకుని కుర్రవాడు వీధిలోకి బయల్దేరాడు. ముందుగా అతనికి ఓ పండ్ల దుకాణం కనిపించింది. దుకాణంలోకి వెళ్లి ఆ దుకాణదారుడికి తన దగ్గర ఉన్న రాయిని చూపించి ‘దీన్ని తీసుకుని మీరేం ఇవ్వగలరు,’ అని అడిగాడు. పండ్ల దుకాణదారుడు ఆ రాయిని ఎగాదిగా చూసి ‘ఓ ఐదు డజన్ల యాపిల్స్ ఇస్తాను,’ అని గొప్పగా చెప్పాడు.

 

ఆ తరువాత కుర్రవాడు ఓ కూరగాయల దుకాణంలోకి ప్రవేశించాడు. తన దగ్గర ఉన్న రాయిని చూపించి ‘ఈ రాయికి బదులుగా మీరేం ఇవ్వగలరు?’ అని అడిగాడు. దానికి ఆ దుకాణదారుడు ‘నేను ఓ బస్తా బంగాళదుంపలు ఇచ్చేందుకు సిద్ధం,’ అని చెప్పాడు.

 

తన రాయికి పండ్లు, కూరగాయల దుకాణాల దగ్గర అంతగా విలువ లభించడం లేదనుకున్నాడు కుర్రవాడు. దాంతో దగ్గరలో ఉన్న ఓ నగల దుకాణంలోకి వెళ్లాడు. దుకాణంలో కుర్రవాడు చూపించిన రాయిని చూడగానే నగల వర్తకుడు డంగైపోయాడు. ‘ఈ రాయికి బదులుగా వంద గ్రాముల బంగారం ఇచ్చేందుకు సిద్ధం,’ అనేశాడు. నగలవర్తకుడి మాటలకి కుర్రవాడు తెగ ఆశ్చర్యపోయాడు. తన తాతగారు ఇచ్చిన ఆ రాయి ఏమంత తీసిపారేయదగింది కాదనిపించింది అతనికి. దాంతో వాళ్లనీ వీళ్లనీ అడిగే బదులు ఓ రత్నాల వర్తకుడి దగ్గరకు వెళ్లాలనుకున్నాడు. దగ్గరలో అలాంటి వర్తకుడు ఎక్కడ ఉన్నాడో వాకబు చేసుకుంటూ ఓ రత్నాల వ్యాపారి దుకాణంలోకి అడుగుపెట్టాడు.

 

రత్నాల వ్యాపారి ముందు ఆ రాయిని ఉంచగానే ఆ వర్తకుడు తన కళ్లని తానే నమ్మలేకపోయాడు. ఓ ముఖమల్ వస్త్రం తీసుకుని బల్ల మీద పరిచి, కుర్రవాడి చేతిలోని రాయిని అపురూపంగా దాని మీద ఉంచాడు. ‘ఇది మామూలు రాయి కాదు. ఇది ఓ గొప్ప పగడం. నా ఆస్తంతా అమ్మినా కూడా దీనిని నేను కొనలేను,’ అంటూ తలవంచి ఆ రాయి ముందు మోకరిల్లాడు.

 

రత్నాల వ్యాపారి దుకాణంలో జరిగిన సంఘటనకి కుర్రవాడు తెగ ఆశ్చర్యపోయాడు. తన చేతిలో ఉన్న రాయిని పదిలంగా గట్టిగా పట్టుకుని అదెక్కడ చేజారిపోతుందో అన్న భయంతో తాతయ్య దగ్గరకు పరుగుతీశాడు. తాతయ్య కుర్రవాడు చెప్పిందంతా చిరునవ్వుతో విన్నాడు.

 

‘ఇవాళ ఉదయం నువ్వు నన్ను మనిషి విలువ ఏమిటి అని అడిగావు కదా! నీకు ఎదురుపడిన అనుభవాలే నీ ప్రశ్నకు సమాధానంగా నిలుస్తాయి. నువ్వు ఆ అమూల్యమైన పగడంలాంటి వాడివి. కానీ నీకు జీవితంలో ఎదురుపడేవారందరూ నీకు తగిన విలువని అందిస్తారనుకోవడం అసాధ్యం. వాళ్ల వ్యక్తిత్వాన్ని బట్టి, విచక్షణని బట్టి నిన్ను అంచనా వేస్తుంటారు. జీవితంలో వాళ్లు విలువైనవి అనుకునేవాటికీ నీకూ పొంతన లేకపోవచ్చు. నిన్ను సరిగా అంచనా వేసే సామర్థ్యం వాళ్లకి ఉండకపోవచ్చు. ఎక్కడో ఒక చోట ఆ రత్నాల వ్యాపారివంటివాడు నీకు ఎదురుపడతాడు. నీ విలువని అంచనా వేయలేనని ఒప్పుకుంటాడు. కాబట్టి నీ విలువ ఇంత అని చెప్పడం అసాధ్యం. అలాగని ముందుగానే నిన్ను నువ్వు అంచనా వేసుకోవడం మూర్ఖత్వం. ఎందుకంటే నువ్వు విలువకి అందని వాడివి. అలాగే ఉండేందుకు ప్రయత్నించు. నీ మీద నువ్వు గౌరవం ఉంచుకో! పండ్ల వ్యాపారీ, కూరగాయల వ్యాపారుల్లాగా నిన్ను తేలికగా అంచనా వేసిన చోట చవకగా అమ్ముడుపోవద్దు,’ అని చెప్పుకొచ్చాడు. ఇంతకీ మనిషి విలువ అమూల్యం అన్నమాట!!!


(ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)

- నిర్జర.