వల్లభనేని వంశీకి షోకాజ్ నోటీసు జారీ చేసిన టిడిపి
Published on: Sat Apr 28, 2012 2:18PM
వల్లభనేని వంశీకి తెలుగుదేశం పార్టీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. శుక్రవారం సాయంత్రం జగన్‌ను కలిసిన సంఘటనపై వివరణ ఇవ్వాలని పార్టీ వంశీని ఆదేశించింది. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి గోరంట్ల బుచ్చయ్యచౌదరి పేరు మీద వంశీకి షోకాజ్ నోటీసు జారీ అయింది. జగన్‌ను వంశీ కలవడం వల్ల తప్పుడు సంకేతాలు వెళ్తాయని టిడిపి నాయకత్వం భావిస్తోంది. తెలుగుదేశం పార్టీ నాయకుడు వల్లభనేని వంశీ శుక్రవారం సాయంత్రం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఈ సంఘటన విజయవాడలో సంచలనం సృష్టించింది. వైయస్ జగన్‌పై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నిప్పులు చెరుగుతున్న స్థితిలో వంశీ ఆయనను కలుసుకుని నవ్వుతూ మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది. ఈ భేటీ యాదృచ్ఛికంగా జరిగిందా, కావాలనే జరిగిందా అనే విషయంపై విజయవాడలో వేడివేడిగా చర్చ జరుగుతోంది.


