వల్లభనేని వంశీ వాట్సాప్ సందేశం.. కొడాలి నాని పేరు ప్రస్తావన
Published on: Mon May 6, 2019 12:15PM

ఎన్నికల అనంతరం కూడా కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గంలో రాజకీయ వేడి తగ్గలేదు. ఎమ్మెల్యే వల్లభనేని తనను బెదిరిస్తున్నారంటూ వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు విజయవాడ పోలీస్ కమిషనర్‌ని కలిసి రక్షణ కోరినట్లుగా వార్తలొచ్చిన విషయం తెలిసిందే. దీనిపై వంశీ కానీ, వెంకట్రావు కానీ ఇంతవరకు బహిరంగంగా ఎక్కడా మాట్లాడలేదు. అయితే తాజాగా వంశీ.. జరిగిన అన్ని పరిణామాలను వివరిస్తూ యార్లగడ్డకు వాట్సాప్ ద్వారా ఓ సందేశం పంపారు.
"డియర్ వెంకట్రావు.. నేను వల్లభనేని వంశీ. గతంలో మన ఉమ్మడి స్నేహితుడు కొడాలి నాని ద్వారా కొన్ని విషయాల్లో నేను నీకు సాయం చేశాను. రమేష్ అనే వ్యక్తి నీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టినప్పుడు, భవానీపురం పోలీస్‌స్టేషన్‌లో వరకట్న వేధింపుల కింద కేసు నమోదైనప్పుడు.. కానీ ఆయా సందర్భాలలో మనిద్దరం ప్రత్యక్షంగా కలవలేదు, కనీసం మాట్లాడుకోలేదు. కేవలం నాని ప్రోద్భలం వల్లే ఇదంతా చేశాను. దీనికి నువ్వు నానికి కృతజ్ఞుడివై ఉండాలి. ఎందుకంటే ఈ కేసుల్లోంచి బయటపడేసి, నీ పాస్‌పోర్టు సీజ్ చేయకుండా కాపాడాడు. నువ్వు గన్నవరం వైసీపీ అభ్యర్థిగా వచ్చే వరకు ఎక్కడా మనిద్దరం కలవలేదు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత లక్ష్మీతిరుపతమ్మ ఆలయంలో నువ్వు కనపడినపుడు నీకు స్వాగతం చెప్పాను. ప్రస్తుత ఎన్నికలతో కలిపి ఇప్పటివరకు మూడు ఎన్నికల్లో నేను పోటీ చేశాను. ఎప్పుడూ టీడీపీ గొప్పదనం గురించి, చంద్రబాబు పరిపాలన గురించి మాట్లాడాను తప్పితే.. ఎవరిపైనా విమర్శలు చేయలేదు. నాపై పోటీ చేసిన లగడపాటి రాజగోపాల్, దుట్టా రామచంద్రరావుల గురించి ఎప్పుడూ కూడా వ్యక్తిగత విమర్శలు చేయలేదు. లగడపాటి పిల్లలు, నా పిల్లలు మంచి స్నేహితులు, ఇప్పటికీ మా పిల్లలు లగడపాటి ఇంటికి వెళ్లి వస్తుంటారు. ప్రస్తుత ఎన్నికల్లోనూ నీ గురించి వ్యక్తిగతంగా ఎలాంటి విమర్శలు చేయలేదు. కేవలం టీడీపీ, చంద్రబాబు పరిపాలన గురించే ప్రచారంలో వివరించాను. కానీ నువ్వు.. నేను గతంలో నీతో ఆర్థిక లావాదేవీలు నిర్వహించి, అప్పు పొందినట్లు చెప్పినట్లుగా నా దృష్టికి వచ్చింది. నువ్వు గన్నవరం వచ్చే వరకు నన్ను చూశావా?, నాతో ఎప్పుడైనా మాట్లాడావా?, ఎప్పుడైనా నాకు అప్పు ఇవ్వడం గానీ, విరాళం ఇవ్వడం గానీ చేశావా?.. కానీ దీనికి భిన్నంగా చేస్తున్న ప్రచారం ఆశ్చర్యకరంగా ఉంది. పైగా నాపై నిరాధార, తీవ్రమైన ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉంది. ఇవన్నీ నా దృష్టికి రావడంతో నియోజకవర్గంలో ఓ మంచి వాతావరణం నెలకొల్పాలనే ఉద్దేశంతో నీకు ఫోన్ చేసి కలవాలనుకున్నా. అందుకే మీ ఇంటికి వచ్చి ఆత్మీయపూర్వకమైన వాతావరణం నెలకొల్పాలనుకున్నా. గన్నవరాన్ని డల్లాస్ లాగా మారుస్తానన్న నీ ప్రతిపాదన విని నీకు సన్మానం చేయాలనుకున్నా. అందుకే నీకు ఫోన్ చేశాను. నువ్వు స్పందిచకపోవడంతో నా మనుషుల్ని అపాయింట్‌మెంట్ కోసం పంపాను. ఆ తర్వాత నేనే వచ్చాను. ఇవి జరిగిన తర్వాత నువ్వు సీపీని కలిసినట్లు, నా నుంచి హాని ఉందని, రక్షణ కల్పించమని అడిగినట్లుగా పత్రికల్లో చూశాను. నా గురించి నువ్వేమీ భయపడనక్కర్లేదు, నా వల్ల నీకెలాంటి ఇబ్బంది ఉండదు. దేవుడున్నాడు, అన్నీ ఆయనకు తెలుసు. అందరికీ ఆ దేవుడే న్యాయం చేస్తాడు." అంటూ వంశీ సందేశాన్ని పంపారు. మరి దీనిపై యార్లగడ్డ ఎలా స్పందిస్తారో చూడాలి.


