TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వంగవీటి వల్లభనేని భేటీ .. అసలేం జరుగుతోంది?

Published on: Tue Jun 14, 2022 12:59PM

గన్నవరంలో స్థానిక ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, టీడీపీ నేత వంగవీటి రాధా మళ్లీ భేటీ అయ్యారు. గన్నవరంలో ఓ ప్రైవేట్ ఫంక్షన్‌లో పాల్గొన్న వీరిద్దరు కొద్ది సేపు ఏకాంతంగా చర్చించుకున్నారు. ఆ తర్వాత వంగవీటి రాధాను గన్నవరం ఎమ్మెల్యే వంశీ స్వయంగా కారు ఎక్కించారు. దీనిపై వంశీని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. స్నేహితులం కాబట్టి మాట్లాడుకున్నామని ముక్తసరిగా సమాధానం ఇచ్చారు. అయితే దాదాపు ఆరు నెలల తర్వాత వీరిద్దరు భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు.. వీరి భేటీతో ఉమ్మడి కృష్ణాజిల్లాలో  రాజకీయం మరోసారి హీటెక్కింది.

2019 ఎన్నికల్లో వల్లభనేని వంశీ టీడీపీ టికెట్‌పై గెలుపొంది.. ఆ తర్వాత జగన్ పార్టీలోకి జంప్ కొట్టారు. నాటి నుంచి నేటి వరకు అంటే.. చంద్రబాబుతోపాటు ఆయన ఫ్యామిలీపై వంశీ అనుచిత వ్యాఖ్యలు చేయడం.. నుంచి గన్నవరం నియోజకవర్గంలో వంశీని ఏకాకిని చేసేందుకు యార్లగడ్డ వెంకట్రావ్ వర్గంతోపాటు దుట్టా రామచంద్రరావు వర్గం ఒకేతాటిపైకి వచ్చి.. ఎంత చేయాలో అంత చేస్తోందని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీ.. ఇరు వర్గాలపై ఒంటరి పోరాటం చేస్తున్నారని ఆయన వర్గం ఆందోళన వ్యక్తం చేస్తోంది.   మరి వచ్చే ఎన్నికల్లో గన్నవరం అసెంబ్లీ టికెట్ నాది అంటే నాదంటూ వంశీ, యార్లగడ్డ, దుట్టా వర్గాలు.. పోటీ పడి మరీ వరుసగా ప్రకటనలు చేస్తున్నాయి. అంతేకాదు... ఈ నియోజకవర్గ పంచాయతీ ప్రస్తుతం  జగన్ భార్య భారతీ వద్దకు చేరిందని సమాచారం.

మరోవైపు వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ గుర్తుపై.. ఎక్కడి నుంచి వంశీ పోటీ చేస్తారనే చర్చ అయితే గన్నవరం నియోజకవర్గంలో చాలా హాట్‌హాట్‌గా నడుస్తోంది.  రానున్న ఎన్నికల్లో వైసీపీ గన్నవరం అసెంబ్లీ టికెట్ వంశీకి  ఇచ్చే చాన్స్ లేదని ఆ పార్టీ వర్గీయులే తెగేసి చెబుతున్నారు.  ఇప్పటికే చంద్రబాబు ఫ్యామిలీపై విమర్శల నేపథ్యంలో వంశీపై మహిళల్లో చాలా వ్యతిరేకత వచ్చిందని.. దీనిని గమనించే వంశీని దూర పెట్టేందుకు జగన్ నిర్ణయించుకున్నారనీ అంటున్నారు. అందుకే   యార్లగడ్డ, దుట్టా రామచంద్రరావు వర్గాలను  వ్యూహాత్మకంగా రంగంలోకి దింపి రెచ్చగొడుతోందనే ఓ చర్చ కూడా గన్నవరం నియోజకవర్గంలో జోరుగా నడుస్తోంది. 

 
గతేడాది డిసెంబర్‌లో వంగవీటి రంగా వర్ధంతి సందర్భంగా విజయవాడలో వంగవీటి రాధా, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, నాటి పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని కలిశారు. ఆ క్రమంలో చిన్న గొన్నూరులో రంగా విగ్రహావిష్కరణ సందర్భంగా తన హత్యకు రెక్కీ జరిగిందని వంగవీటి రాధా సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పుడే వల్లభనేని వంశీ, కొదాలి నాని సమక్షంలోనే ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత అంటే దాదాపు ఆరు నెలల తర్వాత వంశీ, వంగవీటి రాధా భేటీ కావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.