బాలశౌరి... బాట ఎటు?
Published on: Tue Feb 28, 2012 2:29PM
గుం
టూరుజిల్లా: రాజకీయాల్లో కొందరి హవా కొంతకాలమే సాగుతుంది. అటువంటి వారిలో గుంటూరుజిల్లా మాజీ ఎంపి వల్లభనేని బాలశౌరి ఒకరు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం కాంగ్రెస్ లో కీలకపాత్ర పోషించిన ఆయన ప్రస్తుతం ఆ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. 2004 ఎన్నికలకు పూర్వం వ్యాపార రంగంలో ఉన్న బాలశౌరి అనూహ్యంగా రాజకీయ రంగం ప్రవేశం చేసి ఆ ఎన్నికల్లో తెనాలి పార్లమెంటరీ నియోజకవర్గంనుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా విజయం సాధించారు. అప్పటినుంచి వైఎస్ కు దగ్గరయ్యారు. అప్పుట్లో వైఎస్ ఢిల్లీలో అడుగుపెడితే బాలశౌరి నివాసంలో ఆతిధ్యం తప్పనిసరి. 2009 ఎన్నికల నాటికి వారిద్దరి మధ్య అనుబంధం మరింత బలపడింది. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో తెనాలి పార్లమెంటరీ నియోజకవర్గం రద్దు కావడంతో అక్కడినుంచి పోటీ చేసే అవకాశం బాలశౌరి కోల్పోయారు. అయితే వైఎస్ ఆర్ తన స్నేహితుడికి తిరిగి పోటీచేసే అవకాశం కల్పించేందుకు పెద్ద ఎత్తున పావులు కదిపారు. ఒక దశలో ఎంపి రాయపాటిని తప్పించి గుంటూరు నుంచి బాలశౌరిని పోటీచేయించాలని ప్రయత్నించారు. అయితే సోనియాగాంధీ జోక్యంతో ఆ ప్రయత్నం ఫలించలేదు. చివరకు నర్సరావుపేట సిట్టింగ్ ఎంపి మేకపాటి రాజమోహనరెడ్డిని నెల్లూరుకు పంపి అక్కడినుంచి పోటీచేసే అవకాశం బాలశౌరికి కల్పించారు. అయితే కేవలం 1600 ఓట్ల తేడాతో బాలశౌరి ఓటమి చెందారు. అంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్ చార్జి పదవి బాలశౌరిని కట్టబెట్టే ప్రయత్నంలో ఉండగా వైఎస్ ఆర్ హఠాన్మరణం చెందారు. అప్పటినుంచి బాలశౌరి హవాకు కాంగ్రెస్ లో గండిపడింది. జగన్ తో కూడా బాలశౌరికి సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికి ఆయన వైయస్సార్ కాంగ్రెస్ కు దూరంగానే ఉంటున్నారు. అయితే ఆయన ఎన్నికల నాటికి వైయస్సార్ కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతానికి తటస్థ వైఖరి అవలంభిస్తున్న బాలశౌరి పయనం ఎటనేది తేలాలంటే మరికొంత కాలం వేచి ఉండాల్సిందే.


