మహా నాయకుని మహా ప్రస్తానం

ఒక్కొక్కరే వెళ్లిపోతున్నారు. ఆ తరం భావాలను... ఆ నాటి సిద్ధాంతాలను, అప్పటి ప్రేమాభిమానాలను ఇక్కడే వదిలేసి....అలా అలా నడుచుకుంటూ వెళ్లిపోతున్నారు. మొన్నటికి మొన్న ద్రవిళ జాతికి ఆయువులాంటి కరుణానిధి కన్నుమూశారు. నిన్నటికి నిన్న  మార్క్సిజాన్ని ఔపోసన పట్టిన సోమనాథ్ చటర్జి తుది శ్వాస విడిచారు. ఇప్పుడు మాటకారి, చమత్కారి, "సంఘ" శ్రేయోభిలాషి అటల్ బిహారీ వాజ్‌పేయి ఇహాన్ని విడిచి పరలోకానికి పయనమయ్యారు. దీంతో ఓ మహానాయకుడి మహా ప్రస్తానం పూర్తి అయ్యింది. దేశ రాజకీయాల్లో భిన్న ధ్రవాలు. ఒకటి కాంగ్రెస్ పార్టీ భావజాలం. మరొకటి హిందూత్వ సిద్ధాంతం. మూడోది కమ్యూనిస్టు పోరాటం. వీటిలో హిందూత్వకు, కమ్యూనిస్టు ఉద్యమాలకు పొసగదు. రెంటికి ఆకాశం, భూమి మధ్య దూరమంత దగ్గరితనం. అవును దూరమనిపించే దగ్గరితరం ఆ రెండు సిద్ధాంతాల సారం.

 

 

స్వంత లాభం కొంత మానుకుని అన్న నానుడి ఈ రెండు పార్టీలకు అతికినట్లు సరిపోతుంది. అలాంటి హిందూత్వ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ నాయకుడు అటల్ బిహారి వాజ్‌పేయి. పసిప్రాయంలో జనసంఘ్‌తో అడుగులు వేసిన వాజపేయి  ఆ నడకకు నడతను, పరుగును నేర్పారే తప్ప తన మార్గం నుంచి ఎప్పుడూ వెనుతిరగలేదు. ఇందుకోసం ఆయన సంసార జీవితాన్ని వదులుకున్నారు. జగమంత కుటుంబం నాది అనుకున్నారు. అలాగని ఏకాకి జీవితం అని మాత్రం అనుకోలేదు. వంద కోట్ల జనాభా నా కుటుంబం. నేను ఏకాకిని ఎలా అవుతాను అనేది వాజ్‌పైయి చిరునవ్వును చూస్తే అర్ధం అవుతుంది. వద్ధాప్యం వెంటాడగా... మతిమరుపు, శారీరిక సమస్యలతో గడచిన కొంతకాలంగా పోరాడుతున్నారు వాజ్‌పేయి. ఇక పోరాడలేను అనుకున్నారు. జీవధర్మాన్ని అనుసరించి పరమాత్మ వద్దకు చేరుకున్నారు. దేశంలో అతి చిన్న వయసులో లోక్‌సభకు ఎన్నికైన వ్యక్తి అటల్ బిహారీ వాజ్‌పేయి. భాతర తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు నిండు సభలో రేపటి భారత ప్రధాని ఈ యువకుడు అని తనను గురించి ప్రకటించేలా చేసుకున్న అసమాన ధీరుడు వాజ్‌పేయి.

 

 

నెహ్రు వాక్కు ఫలించింది. సువిశాల భారతదేశానికి... ఆ మాటకొస్తే హిందూ దేశానికి తొలి హిందూత్వ పార్టీ ప్రధానిగా ప్రమాణం చేశారు వాజ్‌పేయి. నేటి ముంబాయ్.... నాటి బొంబాయిలో జరిగిన భారతీయ జనతా పార్టీ పదాధికారుల సమావేశం అనంతరం జరిగిన బహిరంగ సభలో పార్టీ మరో నేత లాల్ క్రష్ణ అద్వాణీ " మా ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి " అని హఠత్తుగా ప్రకటించేంత వరకూ వాజ్‌పేయికి తెలియదు తాను ప్రధాని అభ్యర్ధిని అని. ఇది ఆ ఇద్దరు నాయకులు స్నేహానికి, వారిచ్చే రాజకీయ విలువలకి తార్కాణం. కుటిల రాజకీయాలు, కుట్రలు,కుతంత్రాలు ఆనాటి తరానికి తెలియవు. ఆనాడు అద్వాణీ ఉన్నారు కాబట్టి వాజ్‌పేయి ప్రధానమంత్రి అయ్యారు. నేడు వాజ్‌పేయి లేరు కాబట్టి అద్వాణీ ప్రధాని కాలేరు. ఇంతే తేడా. నాటి హిందూత్వ రాజకీయాలకు, నేటి హిందూత్వ రాజకీయాలకు. వాజ్‌పేయి అంటే మాటల ప్రవాహం. వాజ్‌పేయి అంటే కవిత్వ గానం. వాజ్‌పేయి అంటే సుపరిపాలన. వాజ్‌పేయి అంటే చల్లని స్నేహం. కేవలం 13 రోజుల ప్రధానిగా ఉన్నా... ఒక్క ఓటుతో ఆయన్ని గద్దెదించినా చెరగని చిరునవ్వు వాజ్‌పేయి సొంతం. వ్యక్తిగతంగా ఏ ఒక్కరిని పల్లెత్తు మాట అనని వాజ్‌పేయి తన కవిత్వంతోనే చురకలు వేసే దిట్ట. అయోధ్యలో రామమందిర నిర్మాణ సమయంలో కూడా వాజ్‌పేయి ఎంతో నేర్పుగా, ఓర్పుగా వ్యవహరించారే తప్ప ఎక్కడా తడబడలేదు. ఆ వ్యక్తిత్వమే ఆయనను సమూహంలో ఒకడిగా కాకుండా సమూహమే ఆయనగా చేసింది. 

 

 

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత సాధించిన విజయాల్లో రెండు ప్రధానమైనవి. వాటిలో ఒకటి పోలియో నిర్మూలన అయితే, మరొకటి స్వర్ణభూజి పథకం. గ్రామాలను పట్టణాలకు, పట్టణాలను నగరాలకు అనుసంధానం చేస్తూ వేసిన ఆరు లైన్లు, నాలుగు లైన్ల రోడ్ల నిర్మాణం. ఈ పథకంపై అప్పటి ప్రతిపక్షాలు పెదవి విరిచాయి. దీని రూపశిల్పి అటల్ బిహారీ వాజ్‌పేయి. దేశంలో అనేక మార్గాల్లో వందల మైళ్ల దూరం నల్లతాచులా కనిపించే రోడ్లపై నేడు వేలాది వాహనాలు నిత్యం ప్రయాణం చేస్తున్నాయి అంటే దాని వెనుక ప్రధానిగా వాజ్‌పేయి చేసిన క్రషి మరచిపోలేనిది. ఇక పట్టణ పేదల కోసం ఆయన హయాంలో చేపట్టిన వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన (వాంబే) పథకం రూపకల్పన కూడా వాజ్‌పేయి ఘనతే. పట్టణ ప్రజలకు గూడు కల్పించే ఈ పథకం ద్వారా లక్షల మంది నిర్వాసితులు సొంత ఇంటి వారయ్యారు. ఇక రాజకీయంగా కూడా వాజ్‌పేయి తన మార్కుని దేశంలో చూపించారు. పోఖ్రాన్ అణుపరీక్షలు, పొరుగు దేశంతో సత్సంబంధాలు, కార్గిల్ వార్ వంటివి ప్రధానిగా వాజ్‌పేయి విజయాలుగానే పరిగణించాలి. అటల్ బిహారీ వాజ్‌పేయి దేశానికి అన్నీ ఇచ్చారు. ఆయన వెంట కీర్తిని తీసుకువెళ్లారు. ఆప్తమిత్రుడు అద్వాణీని ఒంటరిని చేసి అనంతలోకాలకు సాగిపోయారు. ఆయన మరణానికి తెలుగు వన్ యాజమాన్యం తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తోంది. ఆ మహానాయకుడి ఆత్మకు శాంతి కలగాలని దైవాన్ని ప్రార్ధిస్తోంది.