గ్వాలియర్ నుంచీ గాల్లో కలిసేదాకా… వాజ్ పేయ్ మహాప్రస్థానం!

డిసెంబర్ 25, 1924 – ఆగస్ట్ 16, 2018… ఒక శకం ముగిసింది! ఒక శకటం ఆగిపోయింది! కాలమనే కురుక్షేత్రంలో తనకు తానే కృష్ణుడై, తానే అర్జునుడై ఒక వీరుడు చేసిన యుద్ధం అంతమైంది! అటల్ బిహారీ వాజ్ పేయ్ మరణించారు! దిల్లీలోని ఎయిమ్స్ లో ఆయన 93 వయస్సులో తుదిశ్వాస విడిచారు! ఎక్కడో గ్వాలియర్లో పుట్టిన ఒకానొక సాదాసీదా భారతీయుడు దేశ ప్రధానిగా చరిత్ర సృష్టించారు! ఇంకేం కావాలి? హిందూ శాస్త్రాలు చెప్పిన సంపూర్ణ, పరిపూర్ణ జీవితం… ఈ హిందూత్వవాద కర్మ యోగి స్వంతం! రండి, ఒక సారి గ్వాలియర్ నుంచీ గాల్లో కలిసేదాకా ఈ కమలదళ భీష్మపితామహుని మహప్రస్థానం పరికిద్దాం…

 

 

1.    డిసెంబర్ 25, 1924న అవతరించారు అటల్ బిహారీ వాజ్ పేయ్! గ్వాలియర్ నగరంలోని ఓ సాదాసీదా భారతీయ కుటుంబం ఆయనది!

2.    మామూలుగా టీనేజ్ లో అందరూ ప్రేమలో పడతారు! కానీ, తన జీవిత కాలం భీష్మ పితామహుడిలా బ్రహ్మచారిగా మిగిలిన వాజ్ పేయ్ దేశంతో ప్రేమలో మునిగిపోయారు! టీనేజ్ లోనే ఆయన మొదట కమ్యూనిజం వైపు ఆకర్షితులై స్వతంత్రోద్యమంలో పాల్గొన్నారు. తరువాత అది సరిపడదని గ్రహించి ఆరెస్సెస్ తో లీనమయ్యారు! అదే అటల్ బీహారీ వాజ్ పేయ్ అనే చరిత్రకు శ్రీకారం!

3.    1950లలో వాజ్ పేయ్ ఆరెస్సెస్ వారి పత్రిక ఒకటి నడిపారు. అందుకోసం తన న్యాయవాద విద్యని కూడా వదిలేశారు. లా కాలేజ్ నుంచీ బయటకు వచ్చి సంఘం సేవలో మునిగారు. మెల్లమెల్లగా ఆరెస్సెస్ లోని మితవాద బృందానికి ఆయన ముఖ్యగొంతుక అయ్యారు!

 

 

 

4.    కమ్యూనిజాన్ని వదిలి ఆరెస్సెస్ ను ఎంచుకున్న వాజ్ పేయ్ క్విట్ ఇండియా ఉద్యమంతోనే తన పోరాటాలు మొదలు పెట్టారు. అయితే, ఆయన జీవితంలో కీలక మలుపు మరో జాతీయ వాద నేత శ్యామా ప్రసాద్ ముఖర్జీతో పరిచయం వల్ల ఏర్పడింది. శ్యామా ప్రసాద్ ముఖర్జీ జనసంఘ్ స్థాపించారు. అదే తరువాతి కాలంలో భారతీయ జనతా పార్టీ అయింది. శ్యామా ప్రసాద్ ముఖర్జీ ప్రధాన అనుచరుడుగా వాజ్ పేయ్ కొనసాగారు…

5.    1953లో శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఆమరణ నిరాహార దీక్ష చేశారు! కాశ్మీర్లో ప్రవేశించటానికి భారతీయులకి ప్రత్యేక అనుమతి పత్రం అవసరమని నెహ్రు ప్రభుత్వం రూల్ పెట్టింది. ఈ ఐడెంటిటి కార్డు రాజకీయాల్ని నిరసిస్తూ ముఖర్జీ నిరాహార దీక్ష చేశారు. వాజ్ పేయ్ ఆయన పక్కనే వున్నారు! అదే ఆయనలో గణనీయమైన మార్పు తీసుకొచ్చింది. తరువాత శ్యామా ప్రసాద్ ముఖర్జీ డిమాండ్ చేసినట్టు కాశ్మీర్ లోకి అనుమతి పత్రాలు వుంటేనే ప్రవేశం అనే నిబంధన తొలిగింది. కానీ, ఆ మహానేత తరువాత కొన్నాళ్లకే మరణించారు. ఇది కూడా వాజ్ పేయ్ ని తాను నమ్మిన జాతీయ వాద, హిందూత్వ సిద్దాంతానికి మరింత దగ్గర చేసింది. ముఖర్జీ ఆశయ సాధన కోసం వాజ్ పేయ్ ముందుకు సాగుతూ వచ్చారు…

6.   1957లో శ్యామా ప్రసాద్ ముఖర్జీ ప్రేరణతోనే వాజ్ పేయ్ ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి కాలు పెట్టారు! ఎంపీగా గెలిచి పార్లమెంట్లో ప్రవేశించారు!1

7.   1957 నుంచీ 2009 వరకూ అటల్ ఏకబిగిన పదిసార్లు గెలుస్తూనే వచ్చారు ప్రజాప్రతినిధిగా! అర్థ శతాబ్దం పాటూ ఆయన లేకుండా మన పార్లమెంట్ వుండేదే కాదు! అంతగా స్వతంత్ర భారతంలో ఆయన అంతర్భాగం అయ్యారు!

8.   నెహ్రు కాలంలోనే కాంగ్రెస్ ను ఢీకొట్టి హిందూత్వ రాజకీయాలు నెరిపిన జాతీయ వాది వాజ్ పేయ్! చివరకు ఆయనే అయిదేళ్లు దిగ్విజయంగా భారతదేశాన్ని ఏలిన తొలి కాంగ్రేసేతర ప్రధాని అయ్యారు!

9.   వాజ్ పేయ్ ప్రధాని ప్రస్థానం అంత తేలిగ్గా జరగలేదు. సెక్యులర్ పార్టీల అవకాశవాద రాజకీయాలు బీజేపీని అప్పట్లో అంటరాని పార్టీగా చూసేవి! అందువల్ల సరైన సంఖ్యాబలం లేక తొలిసారి 1996లో 13 రోజులకే పదవి నుంచీ దిగిపోవాల్సి వచ్చింది వాజ్ పేయ్!

 

 

10.  1998లో మరోసారి ప్రధాని అయినా… 13 నెలల్లో ప్రధాని పదవికి రాజీనామా చేశారు. జయలలిత మద్దతు ఉపసంహరణతో కేవలం ఒకే ఒక్క ఎంపీ ఓటు లోటుగా వుండి అధికారం కోల్పోవాల్సి వచ్చింది. అయినా ధర్మం వైపే నిలిచారు కానీ… వాజ్ పేయ్ ఇతర పార్టీల ఎంపీలతో బేరసారాలు చేయలేదు!

11.    ఆయన సహనానికి, ధర్మ నిరతకి దైవం కూడా మెచ్చింది! ఎట్టకేలకు 1999లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది! ఈసారి వాజ్ పేయ్ ప్రధాని అయ్యారు! చరిత్రలో తొలిసారి కాంగ్రెస్ కు చెందని నాయకుడు అయిదేళ్లు విజయవంతంగా దేశాన్ని పరిపాలించాడు! కొత్త శతాబ్దంలో కొత్త చరిత్ర రచన జరిగింది!

12.   వాజ్ పేయ్ ప్రధానిగా ప్రోక్రన్ అణు పరీక్షలు జరిపి ప్రపంచానికి సరికొత్త భారతదేశాన్ని ఆవిష్కరించారు! పాకిస్తాన్ కు గుణపాఠాలు, చైనాకు పాఠాలు నేర్పారు! వరుస కాంగ్రెస్ ప్రభుత్వాలు చేయని సాహసం వాజ్ పేయ్ తన అయిదేళ్ల పాలనలో చేసి చూపారు! అంతర్జాతీయంగా ఇండియా ధీటైన శక్తిగా మారింది!

13.   అతివాద హిందూ శక్తుల నుంచీ ఎంత ఒత్తిడి వచ్చినా వెనక్కి తగ్గని వాజ్ పేయ్ లాహోర్ బస్సు యాత్ర చేసి పాకిస్తాన్ కు స్నేహ హస్తం చాచారు. కానీ, దాన్ని దుర్వినియోగం చేసిన ఉగ్రవాద దేశానికి కార్గిల్ సమయంలో గట్టిగా బుద్ది చెప్పారు! పాక్ పై యుద్ధంలో దేశాన్ని గెలిపించిన తొలి కాంగ్రేసేతర ప్రధాని కూడా వాజ్ పేయే!

14.  చిరకాల మిత్రుడు అద్వాణీతో కలిసి రామజన్మభూమి ఉద్యమంలో పాల్గొన్నప్పటికీ వాజ్ పేయ్ ముస్లిమ్ లకు , ఇతర మైనార్టీలకు, సెక్యులర్ పార్టీలు, నాయకులకి… అభ్యంతరం లేని నేతగా ఎదుగుతూ వచ్చారు! ఆయనని చాలా మంది రైట్ మ్యాన్ ఇన్ రాంగ్ పార్టీ అనటమే ఇందుకు నిదర్శనం! ఒక్కమాటలో చెప్పాలంటే ఆయన హిందూత్వవాదులకి , కానీ వారికి కూడా మిత్రుడైన ఆజాతశత్రువు!

15.   మొరార్జీ దేశాయ్ ప్రభుత్వ కాలంలోనే విదేశాంగ శాఖా మంత్రిగా వున్న ఆయన ఐక్య రాజ్య సమితి సమావేశంలో తన చారిత్రాత్మక హిందీ ప్రసంగం చేశారు! ఆ తరువాత కూడా ఆయన ఎన్నో చరిత్రాత్మక ఉపన్యాసాలు సభ లోపల, వెలుపల చేశారు! అద్భుత ఉపన్యాసకుడైన వాజ్ పేయ్ కవి కూడా! ఆయన కవితల్లో , మాటల్లో అవలీలగా జీవిత తాత్వికత, భారతీయత పొంగిపొర్లుతుంటాయి!