పార్లమెంటరీ బోర్డు నుండి అద్వానీకి ఉద్వాసన

 

భారతీయ పార్టీకి  లాల్ కృష్ణ అద్వానీ భీష్మాచార్యుడు వంటివారు. బీజేపీని బలోపేతం చేయడానికి ఆయన చేయని ప్రయత్నం లేదు. మతతత్వ పార్టీగా ముద్రపడిన బీజేపీ మొట్టమొదటిసారిగా కేంద్రంలో అధికారం రావడానికి ఆయన కృషి, పట్టుదల, శక్తి యుక్తుల వలనే సాధ్యమయిందని చెప్పకతప్పదు. కానీ నరేంద్ర మోడీ ప్రవేశంతో క్రమంగా ఆయన ప్రాభవం తగ్గుతూ వస్తోంది. తగ్గుతూ వస్తోంది అని చెప్పడం కంటే తగ్గించబడుతోందని చెప్పడమే భావ్యం.

 

అందరూ ఊహించినట్లే మోడీ క్రమంగా పార్టీని, ప్రభుత్వాన్ని పూర్తిగా తన అదుపాజ్ఞలలోకి తెచ్చుకొంటూ, ముఖ్యమయిన స్థానాలలో తనకు అనుకూలమయిన వ్యక్తులను నియమించుకోవడం మొదలు పెట్టారు. ఇప్పటికే మంత్రులందరినీ తన చెప్పు చేతలలో ఉంచుకొన్న ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ ను మంత్రి వర్గంలోకి తీసుకొని, ఆయన స్థానంలో తనకు అత్యంత నమ్మకస్తుడయిన అమిత్ షాను నియమించుకోవడం ద్వారా పార్టీపై కూడా పూర్తిగా పట్టు సాధించే ప్రయత్నాలు చేయడం ఆయన దూరాలోచనకు ఒక నిదర్శనం.

 

తన అనుచరుడు అమిత్ షాను పార్టీ అధ్యక్షపదవి కట్టబెట్టిన మోడీ తరువాత ఆయనకీ పార్టీలో అత్యున్నతమయిన పార్టీ పార్లమెంటరీ బోర్డు అధ్యక్ష పదవిని కూడా కట్టబెట్టారు. తనకు వ్యతిరేఖులు లేదా తాను వ్యతిరేఖించే వారినందరినీ చాలా తెలివిగా అడ్డు తొలగించుకొనే అలవాటున్న మోడీ, అమిత్ షా ద్వారా పార్టీలో త్రిమూర్తులుగా చెప్పుకోబడే అద్వానీ, వాజ్ పేయి, మురళీ మనోహర్ జోషీలను పార్టీ పార్లమెంటరీ బోర్డు నుండి తప్పించి, వారిని కొత్తగా సృష్టించిన ‘మార్గదర్శక్ మండల్లో’కి మార్చారు. అంటే ఇకపై పార్టీ కీలక నిర్ణయాలలో వారి ముగ్గురి ప్రమేయం, ప్రభావం ఏమాత్రం ఉండబోదని, కేవలం సలహాలు మాత్రమే ఇస్తారని అర్ధమవుతోంది. ఇన్ని కీలక నిర్ణయాలు తీసుకొని చకచకా అమలు చేసేస్తున్న మోడీకి ఇక వారిచ్చే సలహా ఏముంటుంది? ఇచ్చినా ఆయన పాటిస్తారని ఎవరు భావిస్తారు.

 

వృదాప్యం వలన వాజ్ పేయి చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు గనుక ఈ మార్పుల వలన ఆయనకు వచ్చే నష్టం కష్టం ఏమీ ఉండబోదు. కానీ, నేటికీ పార్టీలో లేదా ప్రభుత్వంలో గానీ కీలక బాధ్యతలు నిర్వహించాలని ఉవ్విళ్ళూరుతున్న అద్వానీ, మురళీ మనోహర్ జోషీలకు మోడీ ఈవిధంగా స్వచ్చంద పదవీ విరమణ చేయించడం వారిరువురికీ కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. కానీ కొత్త నీరు వచ్చి చేరితే పాత నీరు బయటకిపోక తప్పదు కదా!