TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

టీమ్ ఇండియాలోకి వైభవ్ సూర్యవంశీ? ఇంగ్లాండ్ మాజీ స్కిప్పర్ విన్నపానికి బీసీసీఐ ఓకే అంటుందా?

Published on: Tue Mar 31, 2026 11:11AM

భారత క్రికెట్ లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశి. అతడి ఆట, టెక్నిక్, ప్రపంచ దిగ్గజ బౌలర్లను కూడా చీల్చి చెండాడుతున్న బ్యాటింగ్ అతడికి ప్రపంచ క్రికెట్ లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించి పెట్టాయి. కేవలం 14 ఏళ్ల పసి ప్రాయంలోనే ఐపీఎల్ లో అరంగేట్రం చేసి, ఆడిన తొలి మ్యాచ్ లోనే సెంచరీతో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన వైభవ్ సూర్యవంశిని టీమ్ ఇండియాలోకి తీసుకోవాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ డిమాండ్ లు ఇండియన్  క్రికెట్ ఫ్యాన్స్ నుంచే కాదు.. దేశ దిగ్గజ మాజీల నుంచీ, అంతర్జాతీయంగా క్రికెట్ దిగ్గజాల నుంచీ కూడా వస్తుండటం విశేషం.  వైభవ్ సూర్యవంశీ ప్రతిభపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. 

ఈ నేపథ్యంలోనే  రాబోయే ఇంగ్లాండ్ టూర్ కు టీమ్ ఇండియాలో వైభవ్ సూర్యవంశికి చోటు కల్పించాలని ఇంగ్లాండ్ మాజీ స్కిప్పర్  మైఖేల్ వాన్  బీసీసీఐని కోరారు. ఐపీఎల్ ఆరంగేట్రంతోనే అందరి దృష్టినీ ఆకర్షించిన వైభవ్.. అండర్ 19 వరల్డ్ కప్ లో కూడా భారత జట్టు విజయంలో అత్యంత కీలక పాత్ర పోషించాడు. ఇక ఐపీఎల్ 2026 సీజన్‌లో తొలి మ్యాచ్ లో కూడా అదరగొట్టాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగిన వైభవ్,   ప్రత్యర్థి బౌలర్లను చీల్చి చెండాడి.. హాఫ్ సెంచరీ సాధించాడు.  

ఈ నేపథ్యంలో  అతడిని వెంటనే జాతీయ జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు వైభవ్ కు 15 ఏళ్లు నిండటంతో అంతర్జాతీయ సీనియర్ క్రికెట్ లో ప్రవేశించడానికి అడ్డుగా ఉన్న నిబంధనలు తొలగిపోయాయి. ఈ నేపథ్యంలోనే  ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్   వైభవ్‌కు త్వరలో ఇంగ్లాండ్ లో పర్యటించనున్న టీమ్ ఇండియా  స్క్వాడ్‌లో అవకాశం కల్పించాలని బీసీసీఐకి సూచించాడు. 

వైభవ్ సూర్యవంశీ ఆటతీరును చూస్తుంటే అతను సహజసిద్ధమైన హిట్టర్‌గా కనిపిస్తున్నాడని వాన్ విశ్లేషించారు. యశస్వి జైస్వాల్ వంటి స్టార్ ఆటగాడితో కలిసి ఓపెనింగ్ చేస్తున్నప్పటికీ, వైభవ్ ఎక్కడా తడబడకుండా తనదైన శైలిలో బంతులను స్టాండ్స్‌లోకి పంపిస్తున్నాడని కొనియాడారు. 

ఇక రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ కూడా వైభవ్‌ను పొగడ్తలతో ముంచెత్తాడు.  బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌లపై కూడా అతను చూపిస్తున్న తెగింపు తమను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తోందన్నాడు. 

ఇటీవల అండర్-19 స్థాయిలో కూడా రాణించిన వైభవ్‌కు అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు వయసు అడ్డంకి తొలగిపోవడంతో, బీసీసీఐ సెలెక్టర్లు అతడిని పరిగణనలోకి తీసుకుంటారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఇంగ్లాండ్ పర్యటనకు వైభవ్ ఎంపికైతే, అతి తక్కువ వయసులో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించినఆటగాడిగా రికార్డ్ సృష్టించిన వాడౌతాడు.