ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ ట్రయల్స్ పై క్లారిటీ ఇచ్చిన ఆస్ట్రాజెనికా సీఈఓ.. 

ప్రపంచం మొత్తం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ మూడవ దశ ట్రయల్స్ ను నిలిపివేస్తున్నట్టుగా ఆస్ట్రాజెనికా నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రకటనతో ప్రజలు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. ఈ వ్యాక్సిన్ డోస్ వేసుకున్న ఒక వాలంటీర్ కు తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చాయని, అందువల్ల ట్రయల్స్ నిలిపివేస్తున్నామని ప్రకటించడంతో వ్యాక్సిన్ పై సందేహాలు ఏర్పడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా దీనిపై తీవ్ర చర్చ ప్రారంభం కావడంతో, తాజాగా ఆస్ట్రాజెనికా సీఈఓ పాస్కల్ సోరియట్ స్పందించారు.

 

ఇదే విషయంపై పలు ప్రపంచ దేశాల నుండి వివరణ కోరుతూ ఆయనకు పలు ప్రశ్నలు రావడంతో.. ప్రముఖ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్ జేపీ మోర్గాన్ దీనికోసం ఓ టెలీ కాన్ఫరెన్స్ ను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా సోరియట్ మాట్లాడుతూ, యుకె లో వ్యాక్సిన్ ట్రయల్స్ లో పాల్గొన్న ఓ మహిళకు తీవ్రమైన నరాలకు సంబంధించిన అనారోగ్య సమస్య వచ్చిందని.. అయితే ఆమెకు ఏమైందన్న విషయంలో ఇంతవరకూ నిపుణులు ఎటువంటి నిర్ధారణకు రాలేదని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం ఆమె పూర్తిగా కోలుకున్నారని తెలిపారు. త్వరలో ఆమె ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కూడా కాబోతున్నారు అని అయన తెలిపారు. అంతేకాకుండా సురక్షితమైన వ్యాక్సిన్ కోసం తమ ముఖ్య ప్రయత్నమని.. దీంతో వ్యాక్సిన్ పూర్తి సురక్షితమని తేలితేనే రిజిస్టర్ చేస్తామని అయన ఈ సందర్భంగా స్పష్టం చేసారు .

 

అయితే ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ నిలిపివేయడం ఇదే మొదటిసారి కాదని, గత జూలైలో కూడా ఒక వాలంటీర్ కు ఇలాగే నరాలకు సంబంధించిన సమస్యలు వచ్చాయని, అప్పుడు కూడా తాము ట్రయల్స్ ఆపివేశామని తరువాత జరిగిన వైద్యుల పరీక్షల్లో ఆ వాలంటీర్ కు వచ్చిన సమస్యలు వ్యాక్సిన్ వల్ల కాదని తేలిందని ఆయన స్పష్టం చేశారు.