ఎడిషన్లు మూసేస్తున్న వార్త
Published on: Wed May 9, 2012 9:59AM
ఈనాడు అధినేత రామోజీరావుతో వచ్చిన వివాదం కారణంగా ఆయనకు పోటీగా గిరీష్ సంఘీ వార్త దినపత్రికను నెలకొల్పారు. అయితే ఇప్పుడు ఆ పత్రిక ఓ పెద్ద సంక్షోభంలో చిక్కుకుంది. గిరీష్ సంఘీ ఆధ్వర్యంలోని సంఘీ పాలియస్టర్ ఇప్పటికే మూతపడింది. ఈ సంస్థ బ్యాంకులకు సుమారు 2వేల కోట్ల రూపాయలు బకాయి పడివుంది. ఈ టెన్షన్ లో ఉన్న గిరీష్ సంఘీ వార్త పత్రికను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. దీంతో ఆ పత్రిక కూడా సంక్షోభంలో పడింది.
నష్టాలు పెరిగిపోతుండటంతో నిజామాబాద్ ఎడిషన్ ను నాలుగురోజుల క్రితం మూసివేశారు. త్వరలోనే మరో నాలుగు ఎడిషన్లు కూడా మూసేయాలని ఆయన ఆలోచిస్తున్నట్లు తెలిసింది. సంఘీ పాలియస్టర్ సంక్షోభం తరువాత గిరీష్ సంఘీ వార్త బాధ్యతలను పూర్తిగా తన కుమారుడికి అప్పగించారు. కుమారుడి హయాంలో పత్రిక పరిస్థితి మరింత దారుణంగా పతనమైంది. ప్రస్తుతం ఉద్యోగులకు జీతాలు కూడా సక్రమంగా చెల్లించటం లేదు.


