పవన్ నా కష్టాన్ని చూశాడు...


తెలంగాణ పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ పై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు పలు విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే కదా. అంతేకాదు నాతో పాటు కలిసిరా..ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకుందాం అని కూడా ఓ ఆఫర్ ఇచ్చారు. ఇక ఈ వ్యాఖ్యలపై స్పందించిన పవన్ కళ్యాణ్... వీహెచ్ ను కాంగ్రెస్ సీఎం అభ్యర్దిగా ప్రకటిస్తే తప్పకుండా వస్తానని చెప్పారు. దీంతో ఇప్పుడు పవన్ వ్యాఖ్యలపై స్పందించిన వీహెచ్... తాను సీఎం కావాలనుకోవడం పవన్‌ అభిమానమన్నారు. మొదటి నుంచి పార్టీలో కష్టపడి పనిచేస్తున్నానని.. అంచెలంచెలుగా పైకివచ్చానని పవన్‌ తన గురించి అలా వ్యాఖ్యలు చేసి ఉండొచ్చని వీహెచ్ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌పార్టీలో సీఎంను అధిష్టానం నిర్ణయిస్తుందని, అధిష్టానం దృష్టికి పవన్‌ వ్యాఖ్యలను ఎవరో ఒకరు తీసుకెళ్తారని ఆయన అన్నారు. తాను పవన్‌తో పాటు వెళ్లడం కాదు.. పవన్‌ నాతో కలిసి వస్తానంటే.. పల్లెల్లో రైతుల కష్టాలు, ప్రాజెక్టుల్లో అవినీతి నిరూపిస్తాని ఆయన చెప్పారు. పవన్‌కల్యాణ్‌లో ఇంకా మార్పు రావాలని.. పవన్‌కల్యాణ్‌ తనపై సానుకూల వ్యాఖ్యలు చేయడంకాదు.. ప్రభుత్వ అవినీతి, అక్రమాలను గుర్తించాలని వీహెచ్‌ సూచించారు.