నక్కని ప్రేమించింది… నరకానికి వెళ్లి తిరిగొచ్చింది!

 

ఉజ్మా అహ్మద్… నెల రోజుల క్రితం వరకూ ఎవ్వరికీ తెలియని ఒక భారతీయ ముస్లిమ్ మహిళ. కాని, ఇప్పుడు ఆమె ప్రపంచం ముందు పాక్ నుంచి ఇండియాకి ప్రాణాలతో తిరిగొచ్చిన అదృష్టవంతురాలు! గురువారం విదేశాంగ శాఖా మంత్రి సుష్మా స్వరాజ్ సమక్షంలో ఆమె మీడియా ముందుకొచ్చింది. తన నాలుగేళ్ల కూతుర్ని కళ్ల వెంట నీళ్లు కారిపోతుంటే గట్టిగా వాటేసుకుంది. అలా తనని ముద్దాడగలనని బహుశా ఆమె కొన్నాళ్ల క్రితం ఊహించి కూడా వుండదు. అంతటి నరకకూపంలోకి ప్రమాదవశాత్తూ జారిపోయి మళ్లీ బయటపడింది!

 

ఉజ్మా అహ్మద్ మలేషియాలో ఒక ట్యాక్సీ డ్రైవర్ తో ప్రేమలో పడింది. తాహిర్ అలీ అనే అతను పాకిస్తానీ. అయితే, అతడ్ని కలిసేందుకు కొన్నాళ్ల క్రితం పాకిస్తాన్ వెళ్లిన ఉజ్మా నరకం ఎలా వుంటుందో చవి చూసింది. తాహిర్ అలీ మలేషియాలో అయితే ప్రేమించాడు కాని… తన స్వంత దేశం పాక్ కి వచ్చేటప్పటికి రాక్షసుడిలా మారిపోయాడు. గన్ పెట్టి బెదిరించి ఉజ్మాను పెళ్లాడిన తాహిర్ ఆమెను కొడుతూ, హింసిస్తూ నరకం చూపాడు. ఎలాగో అతడ్ని తాను భారత హై కమీషన్ ఆఫీస్ కి వెళతానని, వీసాలు తెచ్చుకుంటాననీ కన్విన్స్ చేసిన ఉజ్మా … ఒక్కసారి ఇండియన్ ఎంబసీలో కాలుమోపి మళ్లీ బయటకి వెళ్లలేదు. తనని తాహిర్ కి అప్పగించాలని భారతీయ అధికారులు నిర్ణయిస్తే విషం తీసుకుని ఛస్తానని చెప్పింది!

 

ఈ వ్యవహారం మొత్తం తెలుసుకున్న మన విదేశాంగ శాఖా మంత్రి సుష్మా స్వరాజ్ నేరుగా రంగంలోకి దిగి ఉజ్మాతో మాట్లాడి  భరోసా ఇచ్చారు. రోజులు కాదు… ఏళ్లైనా సరే … ఉజ్మాను ఇండియన్ ఎంబసీలోనే వుంచి కాపాడతామని చెప్పారు. దాంతో ధైర్యం తెచ్చుకున్న ఉజ్మా పాకిస్తాన్ కోర్టులో కేసు వేసి అనుకూల తీర్పు సంపాదించుకుని భారతదేశంలోకి క్షేమంగా అడుగుపెట్టింది!

 

సుష్మ స్వరాజ్ మొదలు పాక్ లోని భారతీయ అధికారుల వరకూ ఎందరో గట్టి కృషి చేస్తే మాతృదేశానికి తిరిగి వచ్చిన ఉజ్మా… పాకిస్తాన్ ఒక మృత్యు కూపం అని తేల్చి చెప్పింది. పాక్ అనే బావిలోకి దూకితే చావు తప్పదనీ, ఆడవాళ్లు కాదు… ఆ దేశంలో మగవాళ్లు కూడా క్షేమంగా వుండలేరని ఆమె హెచ్చరించింది. పూర్తిగా అరాచకమయం అయిపోయిన పాక్ స్థితేంటో ఈ సంఘటన మరోసారి ఋజువు చేసింది!

 

ఈ మధ్య కాలంలోనే దిల్లీలోని ప్రఖ్యాత నిజాముద్దీన్ దర్గా ప్రధాన మౌల్వీ, ఆయన బంధువు కూడా పాక్ లో కిడ్నాప్ కి గురయ్యారు. ఆ దేశానికి వెళ్లిన వాళ్లిద్దర్నీ పాకిస్తాన్ భద్రతా దళాలే నిర్భంధంలో వుంచాయని తరువాత తేలింది. అప్పుడు కూడా మన దేశ విదేశాంగ శాఖ ఎంతో శ్రమ చేసి వార్ని వెనక్కి తీసుకురావాల్సి వచ్చింది!

 

అరాచకానికి మారుపేరుగా మారిపోయిన పాకిస్తాన్ అక్కడి స్వంత ప్రజలకే ప్రమాదకరం అయినప్పుడు విదేశాల వారికి నరకంలా తోచటం ఆశ్చర్యమేం కాదు. ఉజ్మాలాగే దురదృష్టం కొద్దీ పాక్ మృత్యు కూపంలో పడిపోయిన మన కల్భూషణ్ జాదవ్ కూడా క్షేమంగా తిరిగి రావాలని కోరుకుందాం…