ఉత్తరాఖండ్ లో విషాదం.. కొండచరియలు విరిగి పడి ఏడుగురు దుర్మరణం.!
Published on: Fri Aug 14, 2026 9:54AM

ఉత్తరాఘండ్ లో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో నిర్మాణంలో ఉన్న జలవిద్యుత్ ప్రాజెక్టు టన్నెల్‌లో కొండచరియలు విరిగిపడి ఏడుగురు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మరో ఆరుగురు గల్లంతయ్యారు.
గురువారం (ఆగస్టు 13) రాత్రి ఏడుగంటల సమయంలో ఈ విషాదం చోటు చేసుకుంది. తెహ్రీ హైడ్రో డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నిర్మిస్తున్న విష్ణుగడ్-పీపల్‌కోటి జలవిద్యుత్ ప్రాజెక్టు టన్నెల్‌లో కార్మికులు పనుల్లో నిమగ్నమై ఉన్న సమయంలో టన్నెల్ పైభాగం నుంచి భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. క్షణాల వ్యవధిలోనే కొండచరియలతో పాటు కొండపై నుంచి భారీగా బురద, నీరు టన్నెల్ లోపలికి వేగంగా దూసుకొచ్చాయి. ఘటన జరిగిన సమయంలో టన్నెల్ లో 22 మంది కార్మికులు పనిచేస్తున్నారు. నీరు, బురద వేగంగా రావడం, మార్గం మూసుకుపోవడంతో కార్మికులు బయటకు రాలేక లోపలే చిక్కుకుపోయారు.
సమాచారం అందుకోగానే సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF), స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ), ఇండియన్ ఆర్మీ, ఐటీబీపీ బలగాలు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాయి. ఏడుగురు కార్మికుల మృతదేహాలను వెలికి తీశారు. అలాగే తీవ్రంగా గాయపడిన తొమ్మండుగురిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. టన్నెల్ లోపలే మరో ఆరుగురు కార్మికులు చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. డెహ్రాడూన్‌లోని కంట్రోల్ రూమ్ నుండి స్వయంగా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. బాధితులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని అధికారులను ఆదేశించారు. బాధితుల కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
Uttarakhand Tunnel Accident, Chamoli Landslide, Vishnugad Pipalkoti Hydroelectric Project, Tunnel Collapse, NDRF Rescue Operation, TeluguOne


