జబ్బు చేసిందని ఆస్పత్రికి వెళ్లిన కోతి

జంతువులు అప్పుడప్పుడు చాలా వివేకంతో ప్రవర్తిస్తూ ఔరా అనిపించుకుంటూ ఉంటాయి. తాజాగా అచ్చం అలాంటి ఘటనే ఒకటి జరిగింది. మనకి ఆరోగ్యం బాగా లేకపోతే ఆసుపత్రికి వెళ్లి డాక్టర్‌ను కలుస్తాం..అలాగే మన పెంపుడు జంతువులకి ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా కూడా అలానే చేస్తాం. అలాంటిది ఒక కోతి తనకు తానుగా హస్పిటల్‌కు వెళ్లి చికిత్స చేయించుకుంది. డెహ్రాడూన్‌లో జరిగిన ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ కోతి దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి వెళ్లి డాక్టర్ టేబుల్‌ మీద కూర్చుంది..ఆయన వచ్చే వరకు కాసేపు టేబుల్‌పై పడుకుంది. అంతేనా అక్కడే ఉన్న సెలైన్ బాటిల్‌ను ఒక్క గుటకలో తాగేసి బుద్ధిగా కూర్చుంది. ఇంతలా ఓ నర్సు అక్కడికి రావడంతో ఆమెకు తన పొట్టను అదేపనిగా చూపించింది..దీంతో పరిస్థితి మొత్తం ఆమెకు అర్ధంకావడంతో మరో సెలైన్ బాటిల్‌ను ఇచ్చింది..దానిని తాగేసిన వానరం బుద్ధిగా అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ విచిత్ర సంఘటనను కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు.