TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కొంపముంచిన కుటుంబ కథాచిత్రమ్‌

Published on: Sun Mar 12, 2017 5:10PM

కుటుంబ విభేదాలు సమాజ్‌వాదీ పార్టీ కొంపముంచాయి. ఎన్నికలకు ముందు సమాజ్ వాదీ పార్టీలో నడిచిన కుటుంబ కథాచిత్రం అట్టర్ ఫ్లాప్ అయింది. రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా తండ్రి ములాయం మాటనే ధిక్కరించిన తనయుడిగా పేరు తెచ్చుకొనేందుకు అఖిలేష్ యాదవ్ ఎన్ని తంటాలు పడినా లాభం లేకపోయింది. కాంగ్రెస్ పార్టీతో పొత్తుతో పాటు కుటుంబ విభేదాల ప్రభావం ఎన్నికల్లో కనిపించింది. చివరికి ఆ ఫ్యామిలీ డ్రామానే యాదవ పరివారం కొంప ముంచింది.

 

తండ్రీకొడుకుల ఆధిపత్య పోరాటం నిజానికి ఎన్నికల డ్రామాయే అయినప్పటికీ పార్టీకి మాత్రం తీరని నష్టం తెచ్చిపెట్టింది. తొలి నుంచి కాంగ్రెస్ పార్టీతో హోరాహోరీగా తలపడిన ములాయం, సమాజ్‌వాదీ పార్టీ.... చివరికి అదే పార్టీతో కలిసి పోటీ చేయడం యూపీ వాసులు జీర్జించుకోలేకపోయారంటున్నారు. అఖిలేష్ తన చుట్టూ ఉన్నవారి మాట విని తండ్రి ములాయం, బాబాయ్ శివపాల్ యాదవ్, వారి వర్గాన్ని పక్కకునెట్టడం ఘోరమైన తప్పిదమని విశ్లేషిస్తున్నారు.

 

ఎంతో రాజకీయానుభవమున్న ములాయం మాటలకు విలువీయకుండా, అఖిలేష్ ఒంటెత్తు పోకడలకు పోవడం వల్లే పార్టీ ఘోర పరాజయం మూటగట్టుకుందని కార్యకర్తలు మండిపడుతున్నారు. హడావుడిగా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని అఖిలేష్ పార్టీని ఓటమిలోకి నెట్టారని విమర్శిస్తున్నారు. తండ్రి లేని లోటు కాంగ్రెస్ పార్టీ తీరుస్తుందని అఖిలేశ్.. ముస్లింల ఓట్లు సంఘటితమవుతాయని కాంగ్రెస్ పార్టీ తప్పుడు అంచనాలతో పప్పులో కాలేశాయని రాజకీయ నిపుణులు అంటున్నారు. యూపీలో మరోసారి ఎస్పీ నెగ్గాలంటే ములాయం బ్రాండ్‌ తప్ప మరోదారి లేదని ఈ ఫలితాలతో స్పష్టమైందని అంటున్నారు.