TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

గూండాగిరే సైకిల్‌ను దెబ్బకొట్టిందా?

Published on: Sun Mar 12, 2017 4:24PM

ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ అంచనాలకు మించి ఫలితాలు సాధించింది. అయితే బీజేపీ సునామీకి మోడీ మానియాతోపాటు ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూడా కారణమని విశ్లేషిస్తున్నారు. యువ నాయకుడిగా, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపగల సమర్థుడిగా అఖిలేష్ యాదవ్ యూపీలో మంచిపేరే తెచ్చుకున్నారు. పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతోపాటు ల్యాప్ టాప్ లు, సైకిళ్ల పంపిణీ, వ్యవసాయ, పారిశ్రామికాభివృద్ధికి చేపట్టిన చర్యలు ఆయనకు ప్రజల్లో ముఖ్యంగా యువతలో విశేషమైన పేరే తెచ్చిపెట్టాయి. అందుకే  తండ్రితో విభేదించినపుడు అత్యధిక ఎమ్మెల్యేలు ఆయన పక్షానే నిలిచారు.

 

 

అయితే శాంతిభద్రతలను కాపాడటంలో అఖిలేష్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. అదే ఓటర్లను ఎస్పీకి దూరం చేసింది. పలుమార్లు హింసాకాండలు చోటు చేసుకోవడం, మత అసహనం, మహిళలపై అత్యాచారాలు వంటి ఘటనలను అదుపు చేయడంలో అఖిలేష్ పూర్తిగా విఫలమయ్యారు. ఎస్పీ పాలనలో గుండాగిరీ పెరిగిపోయిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనికి తోడు అఖిలేష్ యాదవ్ ఎంపిక చేసిన అభ్యర్థుల్లో 50 శాతానికి పైగా నేరచరిత్ర ఉన్నవారు కావడంతో ఆ పార్టీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనట్లు అర్థమవుతోంది. ఒకపక్క ఎన్నికలు జరుగుతుండగానే అఖిలేష్ సన్నిహితుడైన మంత్రి గాయత్రి ప్రజాపతిపై ఆరోపణలు రావడం...ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం, ఘనమైన నేరచరిత్ర ఉన్న రాజా భయ్యాతో సమాజ్ వాదీ సాన్నిహిత్యం కలిగి ఉండటం సైకిల్ ని గట్టిగా దెబ్బ కొట్టాయి.