TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టయింది

Published on: Sun Mar 12, 2017 11:49AM

చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టయింది సమాజ్ వాదీ పార్టీ పరిస్థితి. కాంగ్రెస్ తో ఎన్నికల పొత్తు ఎందుకు పెట్టుకున్నామా అని ఏడుస్తున్నారు ఎస్పీ లీడర్లు. కూటమిగా 300కి పైగా సీట్లు గెలుస్తామని కలలు కన్న అఖిలేష్ యాదవ్, 60 స్థానాలు కూడా సాధించలేకపోవడంతో రాహుల్ తో జట్టు కట్టడమే కొంప ముంచిందని కుమిలిపోతున్నారు. కాంగ్రెస్ తో జత కట్టకపోయినా ఎస్పీకి ఇప్పటి కంటే ఎక్కువ సీట్లు వచ్చేవని అంటున్నారు. ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నందువల్ల 100కి పైగా సీట్లను కోల్పోవాల్సి వచ్చిందని విశ్లేషించుకుంటున్నారు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడమే అఖిలేష్ చేసిన అతిపెద్ద వ్యూహాత్మక తప్పిదమని చెబుతున్నారు.

 

 

అన్ని స్థానాల్లో పోటీ చేసి ఉంటే ఎస్పీకి ఇంకా ఎక్కువ సీట్లు వచ్చేవని లెక్కలేసుకుంటున్నారు. ఎన్నికల పొత్తు కాంగ్రెస్ కి బదులు బీఎస్పీతో పెట్టుకుని ఉంటే ఫలితాలు మరోలా ఉండేవని అభిప్రాయపడుతున్నారు. ఓబీసీ, దళిత, ముస్లిం ఓటర్లలో గణనీయమైన బలమున్న బీఎస్పీతో జత కట్టి ఉంటే.... బీజేపీ ఈ స్థాయిలో విజయం సాధించి ఉండేది కాదని అంటున్నారు. ఇంకా చెప్పాలంటే యూపీలో ఏ మాత్రం ప్రభావం చూపని హస్తంతో అఖిలేష్ యాదవ్ చేతులు కలపడం సమాజ్‌వాదీ కొంప ముంచిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చేతి దెబ్బతో ఘోరంగా దెబ్బతిన్న తన సైకిల్ కి పంక్చర్లు వేసుకొనే పనిలో పడ్డారు అఖిలేష్.