హరీష్ పన్నెండు ప్రశ్నలు.. ఉత్తమ్ ధీటైన సమాధానం

 

కాంగ్రెస్, టీడీపీల మధ్య పొత్తు షరమ్‌ లేని పొత్తు అని తెరాస సీనియర్ నేత హరీష్ రావు విమర్శించిన సంగతి తెలిసిందే. అంతేకాదు అసలు టీడీపీతో పొత్తు ఎందుకు పెట్టుకున్నారో చెప్పాలని డిమాండ్ చేస్తూ.. టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి 12 ప్రశ్నలు సంధించారు. ఉత్తమ్ దీనికి అంతే ధీటుగా బదులిస్తూ కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. హరీష్ రావు నాకు రాసిన లేఖలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందంటూ తేల్చేశారు.. హరీష్ రావు లేఖతో ఇప్పటివరకూ కేసీఆర్‌ చెబుతున్న వందసీట్ల కల చెదిరిపోయింది. తెలంగాణలో కాంగ్రెస్‌ గెలుపు, తెరాస ఓటమిని ముందుగానే అంగీకరించినందుకు ధన్యవాదాలు తెలుపుకొంటున్నానన్నారు.  

కాంగ్రెస్‌ పొత్తుపై హరీశ్‌రావు సంధించిన 12 ప్రశ్నల్లో ఒక్కటీ తెలంగాణ సమాజానికి పనికొచ్చేది లేదని.. అవన్నీ తెరాస ప్రభుత్వం చేతగానితనాన్ని, పాలనా వైఫల్యాన్ని బయటపెడుతున్నాయని విమర్శించారు. తమ పొత్తు గురించి తెరాస పడుతున్న ఆందోళన చూస్తుంటే వారి పాలన పట్ల ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతోందన్నారు. వారి పాలనే బాగుంటే తాము ఎవరితో పొత్తు పెట్టుకుంటామన్న ఆందోళన ఎందుకని ప్రశ్నించారు. కాంగ్రెస్ తో 2004లో, టీడీపీతో 2009లో తెరాస పొత్తు పెట్టుకోలేదా? అని ప్రశ్నించారు. టీడీపీతో 2009లో పొత్తు పెట్టుకున్నప్పడు ఆ పార్టీ తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చిందని తేల్చిచెప్పిన తర్వాత.. ఆ పార్టీ తెలంగాణ వ్యతిరేక పార్టీ ఎలా అయిందని ప్రశ్నించారు.

కాంగ్రెస్‌ పార్టీవి షరమ్‌ లేని పొత్తులు కావని, తెరాసే షరమ్‌లేని పొత్తులు పెట్టుకుందని ఉత్తమ్‌ విమర్శించారు. తెలంగాణను వ్యతిరేకించి.. రాయల తెలంగాణ డిమాండ్‌ చేసిన ఎంఐఎంతో తెరాస స్నేహమెలా చేస్తోందని నిలదీశారు. ఒంటరిగా పోటీ చేసి కూడా తెరాసను చిత్తుగా ఓడించే సత్తా కాంగ్రెస్ కి ఉందని, అయినా.. తెలంగాణను రక్షించుకోవడం కోసం సిద్ధాంత సారూప్యం ఉన్న పార్టీలతో పొత్తులు పెట్టుకుంటున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ వారు ఎవరితో పొత్తు పెట్టుకుంటే మాకేంటి? అంటూ గతంలో కేసీఆర్‌ అన్నారు. మరి మేం ఎవరితో పొత్తు పెట్టుకుంటే వారికేంటి. ప్రజలకే మేం జవాబుదారులం. ప్రజలకు జవాబు చెప్పుకొనే శక్తి మాకు ఉంది. మా పొత్తుల విషయంలో ఎందుకు అంతగా భయపడుతున్నారు? అని ఉత్తమ్‌ ప్రశ్నించారు.

ఉత్తమ్ లేఖలోని ముఖ్యాంశాలు:

  • చంద్రబాబు తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని అనడం మీ ప్రభుత్వం చేతకానితనానికి పరాకాష్ఠ. చంద్రబాబులో మార్పు వచ్చిందా అని అంటున్నారు.. మరి ఏ మార్పు వచ్చిందని ఆయనను చండీయాగానికి ఆహ్వానించి సన్మానించారు? అమరావతికి వెళ్లి ఆయనింట్లో చేపల పులుసు తిన్నారు? పరిటాల రవి కొడుకు పెళ్లికి వెళ్లి మంతనాలు చేశారు. మీరు చేస్తే సక్రమం మేం పొత్తు పెట్టుకుంటే ద్రోహం అవుతుందా? 
  • సాగునీటి ప్రాజెక్టులు, ఉద్యోగుల విభజన, విద్యుత్‌, పోలవరం, ప్రభుత్వ సంస్థల విభజన, హైకోర్టు విభజన లాంటి అంశాలన్నీ కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉండేవని కూడా తెలీదా? ప్రధానమంత్రి మోదీ భజనలో మునిగి తేలుతున్నపుడు ఆ పనులన్నీ ఎందుకు చేయించలేకపోయారు? 
  • ఖమ్మంలోని ఏడు మండలాలను చంద్రబాబు గుంజుకున్నారని సిగ్గులేకుండా చెబుతున్నారు. రాష్ట్రం సాధించామని గొప్పులు చెప్పుకొంటున్న మీరు.. ఏడు మండలాలు పోతుంటే పోరాటాలు చేయలేరా? చేతగాని దద్దమ్మల్లా చేతులు ముడుచుకు కూర్చున్నారా? సీలేరు విద్యుత్‌ ప్రాజెక్టు, లక్షలాది ఎకరాల భూములు ఆంధ్రాలో కలుస్తుంటే నిద్రపోయారా? మోదీని ఒక్కసారైనా సీలేరు ప్రాజెక్టు గురించి అడిగారా?
  • పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ఆపాలంటూ చంద్రబాబు 30 లేఖలు రాశారని అంటున్నారు. ఎగువ రాష్ట్రమైన మనం ప్రాజెక్టు కడుతుంటే చంద్రబాబు ఎలా ఆపుతారో చెప్పగలరా? ప్రాజెక్టులు కట్టడం చేతకాక చంద్రబాబు అడ్డుకున్నారని వంక పెడుతున్న మీ వైఖరిని తెలంగాణ ప్రజలు అర్థ చేసుకోగలరు.
  • పోలవరం కడితే ఎగువ రాష్ట్రాలకు రావల్సిన 80 టీఎంసీల్లో 45 టీఎంసీలు తెలంగాణకు రావాలని.. దీన్ని చంద్రబాబు అడ్డుకుంటున్నారని అనడం చేతకానితనం. తెలంగాణ నీటిని వదిలితేనే ఆంధ్రప్రదేశ్‌కు పోతాయని గుర్తించాలి.
  • కాంగ్రెస్‌ హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా, గోదావరిపై 86 ప్రాజెక్టులు నిర్మించాం. వాటిని ప్రారంభించినప్పుడు పైన ఉన్న రాష్ట్రాలు ఫిర్యాదులు చేశాయి. చిత్తశుద్ధి ఉన్నప్పుడు ఫిర్యాదులు చేసినా ఆపుతామా? కేంద్రం వద్ద పోరాడి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలి. చేతకాకపోతే క్షమాపణ చెప్పి తప్పుకోవాలి.
  • మిషన్‌ భగీరథపై చంద్రబాబు ఏమని ఫిర్యాదు చేశారో తెలియదు. కమీషన్ల కోసం చేపట్టిన ప్రాజెక్టు అది. బ్యాంకుల నుంచి వేల కోట్లు అప్పులు తెచ్చి కమీషన్లు కొల్లగొట్టారు. ఇంటింటికి నీళ్లు ఇవ్వకపోతే ఓట్లడిగేది లేదన్నారు.. ఇప్పుడు ఇంటింటికీ నీరు వచ్చిందా?
  • పోలవరం ప్రాజెక్టు 150 మీటర్ల ఎత్తులో కడుతున్నారని, 50 లక్షల క్యుసెక్కుల ప్రవాహ నీటి సామర్థ్యంతో డ్యామ్‌ నిర్మించాలని ప్రతిపాదించారని అంటున్నారు. మీరు సీఎంగా ఉండి ఏం చేస్తున్నారు? అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి పోరాడాలి కదా? సమాఖ్య స్ఫూర్తితో కేంద్రం వద్ద పంచాయితీ పెట్టి ఒప్పించాలి కదా? మహారాష్ట్రతో ఒప్పందాలు చేసుకున్నామంటూ.. గొప్పలు చెప్పుకొన్న మీరు.. పక్కనున్న తెలుగు రాష్ట్రంతో ఒప్పందాలు చేసుకోలేరా? ఇదేనా మీ తెలివి? ఆయన ఒక సీఎం, మీరూ ఒక సీఎం. ఆయన గుంజుకున్నారని అంటున్నారంటే.. సీఎంగా మీరు ఏమీ చేయలేని దద్దమ్మ అని ఒప్పుకొన్నట్లేగా?
  • టీడీపీ నుంచి గెలిచిన తలసానికి, తెలంగాణ ద్రోహులుగా ముద్ర పడ్డ మహేందర్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుకు మంత్రి పదవులిచ్చినప్పుడు షరమ్‌ గుర్తుకురాలేదా? తెలంగాణ వాదులను తరిమికొట్టిన మైనంపల్లి హన్మంతరావు, దానం నాగేందర్‌, తీగల కృష్ణారెడ్డి తదితరులను పార్టీలో చేర్చుకున్నప్పుడు సిగ్గనిపించలేదా? తెలంగాణను వ్యతిరేకించి రాయల తెలంగాణ కావాలని డిమాండ్‌ చేసిన ఎంఐఎంను మిత్రపక్షమని మీరు చెప్పుకుంటున్నప్పుడు షరమ్‌ లేదా? అని ప్రశ్నించారు. టీడీపీతో తాము ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నామో అడిగే హక్కు కేసీఆర్‌కు లేదని ఉత్తమ్‌ అన్నారు.