ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి టీఆర్ఎస్ తో కుమ్మక్కయ్యారు!!

 

ఆదివారం జరిగిన కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశంలో పార్టీ ముఖ్యనేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారన్న కారణంతో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణపై సస్పెన్షన్‌ వేటు వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ టీపీసీసీ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి కుంతియా తమ పదవుల నుంచి తప్పుకోవాలని సర్వే డిమాండ్‌ చేశారు. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి టీఆర్ఎస్ తో కుమ్మక్కయ్యారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే టికెట్ల పంపకంలో జాప్యం చేశారని ఆరోపించారు.

అసెంబ్లీ ఎన్నికల్లో తనను కావాలనే ఓడించారని, అధిష్ఠానం డబ్బులు పంపినా టికెట్లు అమ్ముకున్నారని సర్వే ఆరోపించారు. భట్టి విక్రమార్కనూ ఓడించాలని ప్రయత్నించారన్నారు. ఉత్తమ్‌ పెంచి పోషించిన వాళ్లే తనపై దాడికి యత్నించారని, సంబంధం లేని వాళ్లను సమీక్షలో ఎందుకు కూర్చోబెట్టారని ప్రశ్నించారు. ఉత్తమ్‌, కుంతియా పార్టీ నుంచి తప్పుకునే వరకు ఆందోళన చేస్తానని స్పష్టంచేశారు. వీళ్ల మొహం చూసే ప్రజలు ఓట్లు వేయలేదని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్రంలో రాహుల్‌ గాంధీ ప్రధాని కావాలని, ఇక్కడ కేసీఆర్‌ను ఓడించి కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటే పార్టీని ముంచేశారని ఆరోపించారు. ఎయిర్‌ఫోర్స్‌లో పైలట్‌ అయితే దేశం కోసం పనిచేస్తారు గానీ.. ఈ పైలట్‌ మాత్రం తుపాకీకి భయపడి కౌగిలించుకునే రకమంటూ ఉత్తమ్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.