CPSపై జగన్‌కు డెడ్‌లైన్.. CMOను ముట్టడిస్తామని ఉద్యోగుల అల్టిమేటం..
Published on: Sat Apr 23, 2022 12:46PM
మాట తప్పడం.. మడమ తిప్పడంలో.. సీఎం జగన్ బ్రాండ్ అంబాసిడర్‌గా నిలుస్తున్నారు. ఎన్నికల సమయంలో ఉద్యోగులకు అదిచేస్తాం.. ఇదిచేస్తాం.. అంటూ గారెడీ మాటలు చెప్పి.. గద్దె నెక్కాక నట్టేట ముంచారని మండిపడుతున్నారు. అంతన్నారు, ఇంతన్నారు.. మా నెత్తిన చెయ్యి పెట్టారు.. మా ఆకాంక్షలను బూడిద చేశారంటూ ప్రభుత్వ ఉద్యోగులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. పీఆర్సీ పెంపుపై కడుపుమంటతో, ఆక్రోశంతో, ఆవేశంతో ఉన్నారు. చలో విజయవాడతో జగన్ సర్కారును డిఫెన్స్‌లోకి నెట్టేసినా.. పీఆర్సీ పెంపు జరగనేలేదు. డీఏలు, హెచ్ఆర్ఏలో రాజీ తప్పలేదు. ఇక, తమ చిరకాల డిమాండ్, జగన్‌రెడ్డి ఇచ్చిన ఎన్నికల హామీ అయిన సీపీఎస్ రద్దు కోసం వైసీపీ సర్కారుతో చివరిదాకా పోరాడేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే జీతాల మంటతో ఉన్న ఉద్యోగ సంఘాలు.. ఇప్పుడు సీపీఎస్ విషయంలో మాత్రం వెనకడుగు వేసేదేలే అంటున్నారు.
ఏపీలో ఉద్యోగ, ఉపాధ్యాయుల ప్రధాన డిమాండ్ కాంట్రిబ్యూటరీ పింఛన్ విధానం-సీపీఎస్‌ను ఈనెల 25 లోపు రద్దు చేస్తున్నట్లు సీఎం ప్రకటించాలని యూటీఎఫ్ డిమాండ్ చేసింది. సీపీఎస్ రద్దు చేయకుంటే అదే రోజున బైకులతో సీఎంవోను చుట్టుముడుతామని యూటీఎఫ్ నాయకులు హెచ్చరించారు. 2 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులతో సీపీఎస్ ముడిపడి ఉందన్నారు. ఈనెల 24లోపు ముఖ్యమంత్రితోనే ఉపాధ్యాయుల సమావేశం ఏర్పాటు చేయాలని యూటీఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. లేదంటే, సీఎంవోను ముట్టడించి తఢాఖా చూపిస్తామని హెచ్చరించారు.


