పంచెన్ లామా ఎక్కడ?: అదృశ్యంపై చైనాను నిలదీసిన అమెరికా

1995లో ఆరేళ్ల బాలుడిని పంచెన్ లామాగా నియమించిన దలైలామా
మూడు రోజుల్లోనే ఆ బాలుడిని అదుపులోకి తీసుకున్న చైనా
అప్పటి నుంచి ఇంతవరకు ఎవరికీ కనిపించని పంచెన్ లామా

1995లో అదృశ్యమైన పంచెన్ లామా ఎక్కడున్నారంటూ చైనాను అమెరికా ప్రశ్నించింది. పంచెన్ లామ్ ఎక్కడున్నారో యావత్ ప్రపంచం తెలుసుకోవాలనుకుంటోందని వ్యాఖ్యానించింది. 1995 మే 14న అప్పటికి ఆరేళ్ల వయసున్న గెద్హూన్ చోక్యీ న్యీమా (టిబెట్ బాలుడు)ను పంచెన్ లామాగా బౌద్ధ గురువు దలైలామా ప్రకటించారు. బౌద్ధ మతానికి సంబంధించి లామా తర్వాతి స్థానం పంచెన్ లామాదే. ఈయనే తదుపరి లామాగా బాధ్యతలను స్వీకరిస్తారు. అయితే న్యీమాను పంచెన్ లామాగా ప్రకటించిన మూడో రోజే ఆయనను చైనా అదుపులోకి తీసుకుంది. అప్పటి నుంచి ఆయన మరెక్కడా కనిపించలేదు. ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో కూడా బయటి ప్రపంచానికి తెలియదు. ఆయనను ప్రపంచంలోనే అతి పిన్న రాజకీయ ఖైదీగా మానవహక్కుల సంస్థలు పేర్కొంటున్నాయి. ఈ అంశంపై అమెరికా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పంచెన్ లామా ఎక్కడున్నారో చెప్పాలని డిమాండ్ చేసింది. ఈ అంశాన్ని కేవలం దలైలామా వారసుడిని హ్యాండిల్ చేస్తున్న ఎపిసోడ్ మాదిరిగా మాత్రమే చూడొద్దని హెచ్చరించింది. పంచెనా లామాకు నిర్బంధం నుంచి స్వేచ్ఛను కల్పించేలా చైనాపై ఒత్తిడి తీసుకొస్తామని చెప్పింది.  దలైలామా (బౌద్ధమత అత్యున్నత గురువు) వారసుడిని నియమించే అధికారం తనకు ఉందని చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వం భావిస్తోందని... ఆ హక్కు వారికి  లేదనే విషయాన్ని చైనా గుర్తుంచుకోవాలని అమెరికా అంతర్జాతీయ మత స్వేచ్ఛ శాఖ రాయబారి శ్యామ్ బ్రౌన్ బ్యాక్ అన్నారు. దలైలామాను నియమించే హక్కు చైనాకు లేదని స్పష్టం చేశారు.

బౌద్ధ మతానికి కేంద్ర బిందువుగా, ఎంతో ప్రశాంతంగా ఉండే హిమాలయా దేశం టిబెన్ ను చైనా ఆక్రమించుకున్న సంగతి తెలిసిందే. టిబెట్ తమ దేశంలో అంతర్భాగమని వాదిస్తోంది. దలైలామాను ను కూడా అడ్డుతొలగించే ప్రయత్నం చేసింది. దీంతో, దలైలామాకు మన దేశం ఆశ్రయం కల్పించింది. భారత్ పై చైనా కోపానికి ఇదే కారణమనే విషయం గమనార్హం. మరోపైపు చైనా నియంతృత్వాన్ని వ్యతిరేకిస్తూ, చైనాకు భయపడి ఎందరో టిబెటన్లు తమ మాతృభూమిని వదిలిపెట్టి... వివిధ దేశాలకు వలస వెళ్లారు. ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతూనే ఉన్నారు. ఈ మధ్య కాలంలో చైనా సొంతంగా ఒక వ్యక్తిని పంచెన్ లామాగా నియమించింది. చైనా విధించిన అత్యంత కట్టుదిట్టమైన ఆదేశాలు, ఆంక్షల మధ్య పబ్లిక్ లో ఆయన కనిపించినా... ఎక్కువ మంది టిబెటన్లు ఆయనను కనీసం గుర్తించలేకపోయారు. చైనా కోరుకుంటున్నది కూడా ఇదే. ఛరిష్మా లేని వ్యక్తి దలైలామాగా ఉంటే... ఆ వ్యవస్థ కనుమరుగవుతుందని చైనా భావిస్తోంది. దలైలామా నియమించిన పంచెన్ లామా గురించి బీజింగ్ కు అనుకూలమైన ఓ అధికారి 2015లో మాట్లాడుతూ... ఆ యంగ్ మేన్ చాలా ఆరోగ్యంగా ఉన్నారని, చదువుకుంటున్నారని చెప్పారు. ఆ తర్వాత ఆయన గురించి ఇంతవరకు ఎవరూ మాట్లాడింది లేదు. ఇప్పుడు ఇదే అంశాన్ని అమెరికా లేవనెత్తింది. యూఎస్ వ్యాఖ్యలపై చైనా ఏ విధంగా ప్రతిస్పందిస్తుందో వేచి చూడాలి.