కార్గో స్పేస్ క్రాఫ్ట్ కు కల్పనాచావ్లా పేరు

అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి భారతీయమహిళా వ్యోమగామి కల్పనాచావ్లా పేరును ఒక కమర్షియల్ కార్గో స్పేస్ క్రాఫ్ట్ కు పెట్టాలని అమెరికాకు చెందిన నార్త్ రాప్ గ్రూమన్ సంస్థ నిర్ణయించింది. ఈ మేరకు వచ్చే ఏడాది స్పేస్ లోకి పంపనున్న సిగ్నస్ క్యాప్య్సూల్ కు ఎస్ఎస్ కల్పనా చావ్లా అని నామకరణం చేసినట్టు సంస్థ ప్రకటించింది. గ్లోబల్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ టెక్నాలజీ సేవలను అందించే  నార్త్ రాప్ గ్రూమస్ సంస్థ తన అధికార ట్విట్టర్ లో వెల్లడించింది. కల్పనా చావ్లాను గౌరవిస్తున్నాం. ఆమె తొలి భారత మహిళా వ్యోమగామిగా నాసాలో చరిత్ర సృష్టించారు. హ్యూమన్ స్పేస్ క్రాఫ్ట్స్ అభివృద్ధిలో ఆమె ఎంతో సేవ చేశారని, ఎన్జీ-14 సిగ్నస్ ఎయిర్ క్రాఫ్ట్ కు కల్పనా చావ్లా పేరును పెట్టడాన్ని నార్త్ రాప్ గ్రూమన్ గర్వంగా భావిస్తోంది. ప్రతి సిగ్నస్ కూ అంతరిక్ష సేవలందించిన వారి పేర్లను పెట్టాలని కూడా నిర్ణయించాం. స్పేస్ ప్రోగ్రామ్ లో భాగంగా తన ప్రాణాలను పోగొట్టుకున్న ఆమె సేవలను ఎన్నో తరాలు గుర్తు పెట్టుకుంటాయి.   ఆన్ బోర్డ్ రీసెర్చ్, వ్యోమగాముల ఆరోగ్యం, స్పేస్ ఫ్లయిట్ లో సేఫ్టీ తదితర ముఖ్యమైన అంశాలపై ఎంతో సమాచారాన్ని ప్రపంచానికి కల్పనా చావ్లా అందించారని కంపెనీ వెబ్ సైట్ లో పేర్కొన్నారు.

ఈనెల 29న
కల్పనా చావ్లా పేరుతో అంతరీక్షంలోకి వెళ్లే స్పేస్ క్రాఫ్ట్ దాదాపు 3,629 కిలోల బరువైన వస్తువులను స్పేస్ స్టేషన్ కు చేర్చడానికి సిద్ధంగా ఉంది. ఈ నెల 29న ఈ స్పేస్ క్రాఫ్ట్ వర్జీనియాలో ఉన్న నాసా వాలోప్స్ ఫ్లయిట్ ఫెసిలిటీ నుంచి గగనతలంలోకి పంపిస్తారు.

దాదాపు 80 పరిశోధనలు..
కల్పనాచావ్లా అంతరీక్షయానం చేసిన మొదటి భారతీయ మహిళ. ఆమె హర్యానాలోని కర్నాల్ లో 17 మార్చి 1962న జన్మించారు. పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజీ నుంచి 1982లో ఎయిరోనాటికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఆ తర్వాత  ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ నుంచి మాస్టర్స్ డిగ్రీని, కొలరాడో యూనివర్శిటీ నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లో పీహెచ్డీ పూర్తి చేశారు. కమర్షియల్ పైలట్ లైసెన్స్ ను, సర్టిఫైడ్ ఫ్లయిట్ ఇన్ స్ట్రక్టర్ హోదాను అందుకున్న ఆమె 1988లో నాసాలో తన కెరీర్ ను ప్రారంభించారు. 1994లో నాసా  అంతరిక్షంలోకి పంపే వ్యోమగామిగా ఎంపికయ్యారు. ఆ తర్వాత రెండేండ్లకు STS-87  కొలంబియా వ్యొమనౌక లో ఆకాశయానం చేయడానికి సిద్ధమయ్యారు. ఆమె మొదటి అంతరిక్ష ప్రయాణం 1997 నవంబర్ 19 న ఆరు వ్యోమగాములతో మొదలైంది. దాంతో తొలిసారిగా అంతరిక్షానికి  వెళ్లిన భారత మహిళగా చరిత్ర సృష్టించారు. రెండవసారి అంతరిక్ష యానాన్ని చేసే అవకాశం కూడా ఆమెకు లభించింది.  2001లో ఎస్టీఎస్-107 క్రూ మెంబర్ గా ఎన్నికయ్యారు. 2003, జనవరి 16 న ఎస్‌టిఎస్-107 కొలంబియా స్పేస్ షటిల్ లో 16 రోజుల అంతరిక్ష పరిశోధనల కోసం ఆమె అంతరిక్షంలోకి వెళ్ళారు. ఈ రెండు ప్రయాణాల్లో ఆమె దాదాపు 80 పరిశోధనలను పూర్తి చేశారు. స్పేస్ క్రాఫ్ట్ లో తిరిగి భూమ్మీదకు వస్తున్న సమయంలో జరిగిన ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు. అంతరిక్షయానంలో భారత మహిళ పేరును చరిత్రలో తొలిసారి లిఖించి ఎందిరో స్ఫూర్తిదాయకంగా మారారు.  ఆమె జ్ఞాపకార్ధం ప్రపంచవ్యాప్తంగా అనేక విద్యాసంస్థలు, పరిశోధన సంస్థలు అవార్డులను, స్కాలర్ షిప్ లను అందిస్తున్నాయి. మొదటిసారి కమర్షియల్ స్పేస్ క్రాఫ్ట్ కు ఆమె పేరు పెడుతున్నారు.  "పరిస్థితులు ఎలాగున్నా... కన్న కలల్ని నిజం చేసుకోవడమే అంతిమ లక్ష్యం " అంటూ చెప్పే కల్పన చిన్నతనంలో ఆకాశంలో విహరించాలన్న తన కలను నిజం చేసుకున్నారు. 31రోజుల 14గంటల,54నిమిషాలు అంతరిక్షంలో ఉన్న ఆమె చివరికి తన ఊపిరి కూడా ఆకాశంలోనే వదిలారు. ఎందరిలోనూ స్ఫూర్తి రగిలించి చిరంజీవిగా మిగిలారు.