ట్రంప్‌కు ‘అల్జీమర్స్’-పేర్లు మర్చిపోతున్న యూఎస్ అధ్యక్షుడు
Published on: Wed Jan 28, 2026 6:22PM
.webp)
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యం గురించి కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఆయన మతిమరుపు (అల్జీమర్స్)తో బాధపడుతున్నట్టు మీడియాలో కథనాలు వస్తున్నాయి. పలు సందర్భాలలో అధికారుల పేర్లను ఆయన మరిచిపోయారు. ఈ క్రమంలో న్యూయార్క్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు మతిమరుపు ఉందని సాగుతోన్న ప్రచారంపై అగ్రరాజ్యం అధినేత డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. తాను 40 ఏళ్ల కిందట ఎలా ఉన్నానో ఇప్పుడూ అంతే పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని, ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని ఆయన ఆయన స్పష్టం చేశారు.
కానీ, తన తండ్రి అల్జీమర్స్‌తో బాధపడిన విషయం నిజమేనన్నారు. అయితే, తన తండ్రి ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నప్పుడు ‘అల్జీమర్స్’ అనే పదాన్ని ఆయన గుర్తుచేసుకోవడానికి ఇబ్బంది పడ్డారు. దీంతో ట్రంప్ ఆరోగ్యం, మానసిక పరిస్థితిపై మరోసారి చర్చ మొదలైంది. ట్రంప్ తన తండ్రికి ‘గుండె దడ’ ఉందని, పెద్దగా ఆరోగ్య సమస్యలు లేవని, కానీ ఒక వ్యాధి మాత్రం ఉందని చెప్పారు. ఆయనకు సుమారు 86, 87 ఏళ్ల వయసులో మతిమరుపు వచ్చిందంటూ ... ‘ఏమంటారు దాన్ని?’ అంటూ వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కారోలిన్ లీవిట్‌ను చూశారు.
లీవిట్ ‘అల్జీమర్స్’ అని చెప్పగా.. ‘మతిమరుపు లాంటిది. సరే, నాకు అది లేదు’ అని ట్రంప్ అన్నారు. తన తండ్రి ఫ్లయిడ్ ట్రంప్ 1990లలో అల్జీమర్స్ వ్యాధికి గురయ్యారని, 1999లో 93 ఏళ్ల వయసులో మరణించే వరకు ఆ వ్యాధితో బాధపడ్డారని ఆయన గతంలోనే చెప్పారు. గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌కు ఇలాంటి సమస్యే ఎదురయ్యింది. కాగా ప్రస్తుతం ట్రంప్ ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయనది మాటల తడబాటా? లేక మానసిక సమస్యలకు సంకేతమా? అని అనుమానిస్తున్నారు. అమెరికాలో సీనియర్ రాజకీయ నేతల మానసిక స్థితిపై చర్చ జరుగుతున్న సమయంలో ఈ సంఘటన చోటుచేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.


