భారత్ పట్ల అమెరికా వైఖరి మారిందా?

 

అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా రేపు అంటే ఆదివారం నాడు భారతదేశానికి వస్తున్నారు. ఏ రోటి కాడ ఆ పాటే పాడాలన్నట్లుగా ఆయన అమెరికా నుండి బయలుదేరే ముందు భారత ప్రభుత్వాన్ని, ప్రజలను సంతోషపెట్టేందుకు సాంప్రదాయకంగా పాడవలసిన పాటను చాలా చక్కగా పాడారు. ఆయన పాడిన పాట భారత్ లో మారుమ్రోగిపోతోందిపుడు. అల్పసంతోషులయిన భారతీయులు ఆయన మన గురించి చెప్పిన ఆ నాలుగు మంచి ముక్కలకీ చాలా సంతోషపడిపోయారు.

 

ఆయన అమెరికా నుండి బయలుదేరే ముందు మీడియాతో మాట్లాడుతూ భారత్-అమెరికాలు సహజ భాగస్వాములని, తన పర్యటన ద్వారా ఉభయదేశాల మధ్య బంధాలు మరింత దృడపడేందుకు కృషి చేస్తానని అన్నారు. షరా మామూలుగా భారత్ తో తనకున్న అనుబందం ఒకసారి గుర్తు చేసుకొన్న తరువాత, భారత్ పర్యటనకు బయలుదేరేముందు పాక్ దేశాన్ని హెచ్చరించే ఆనవాయితీని కూడా ఆయన మరిచిపోకుండా పాటించారు. పాకిస్తాన్ లో ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడాన్ని తాము సహించబోమని నూట ఒకటవసారి హెచ్చరించారు. పనిలోపనిగా ముంబై దాడులకి బాధ్యులయిన వారిని కటినంగా శిక్షించాలని కూడా పాకిస్తాన్ కి సలహా ఇచ్చారు.

 

ఆయన అంత గట్టిగా మన గురించి మెచ్చుకొన్నాక, మన శత్రుదేశాన్ని అంత గట్టిగా హెచ్చరించిన తరువాత సంతోషించకుండా లేము.  ఒబామా దంపతులు డిల్లీలో అడుగుపెట్టగానే వారికి ఘన స్వాగతం పలికేందుకు కేంద్ర ప్రభుత్వం సర్వం సిద్దంగా ఉంది. పాకిస్తాన్ దేశం పట్ల అమెరికా ఏవిధంగా వ్యవహరిస్తున్నప్పటికీ, అమెరికా అధ్యక్షుడి భారత్ పర్యటన వల్ల మన దేశానికి ఎంతో కొంత మేలు జరుగుతుందని ఖచ్చితంగా చెప్పవచ్చును. ఇంతకు ముందు యూపీఏ అమెరికా ప్రభుత్వం చెప్పే ఇటువంటి తీయటి కబుర్లకి ఐస్ అయిపోయేది. కానీ మోడీ అటువంటి కబుర్లకి పడిపోయే రకం కాదు. ‘మోడీ అంటే బిజినెస్’ అని ఊరికే అనలేదు. కనుక భారత్ కి ప్రయోజనం కలిగేవిధంగా ఆయన ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకొంటారని నిసందేహంగా చెప్పవచ్చును. అయితే భారత్ పట్ల అమెరికాకు అవ్యాజమయిన ప్రేమ ఏమీ లేదనే సంగతి అందరికీ తెలిసిందే.

 

ఇదివరకు ప్రపంచ దేశాలన్నిటికీ ‘భారత్ అంటే అనాగరికులయిన వంద కోట్ల జనాభా, దరిద్రం, అవినీతి తప్ప మరొకటి లేదు’ అనే ఒక నిశ్చితమయిన అభిప్రాయం ఉండేది. భారతదేశంలో ఉన్న వంద కోట్ల మంది జనాభా అడ్డు ఆపు లేకుండా తినేస్తునందునే ప్రపంచంలో ఆహార కొరత ఏర్పడుతోందని గత అమెరికా అధ్యక్షుడు చెప్పిన మాటలు వింటే వారికి భారత్ పట్ల ఎంతటి చులకన భావం ఉందో అర్ధం అవుతుంది. కానీ ఇప్పుడు ఆ వంద కోట్ల అనాగరికులే ప్రపంచంలో కెల్లా అతిపెద్ద మార్కెట్ గా కనిపిస్తున్నారు అందరికీ. అందుకే ప్రపంచ దేశాలన్నీ భారత్ మెప్పు సంపాదించేందుకు తిప్పలు పడుతున్నాయి. అందుకు అమెరికా కూడా ఏమీ అతీతం కాదని ఒబామా తన మాటలతో చెప్పకనే చెప్పారు.

 

భారత్ లో ఉన్న విస్త్రుతమయిన వ్యాపారావకాశాల గురించి క్యాపిటలిస్ట్ దేశమయిన అమెరికాకు తెలియకపోదు. అయితే మన దేశాభివృద్ధికి విదేశీపెట్టుబడులు, పరిశ్రమలు చాలా అవసరం గనుక వారు మన పట్ల ఎటువంటి అభిప్రాయం కలిగి ఉన్నప్పటికీ వారిని సాదరంగా ఆహ్వానించక తప్పదు. ఒకప్పుడు భారతీయులు ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం విదేశాలకు వలసలు పోయేవారు. ఇప్పటికీ పోతున్నారు కూడా. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే రానున్న కాలంలో విదేశీయులే మన దేశానికి వలసలు వచ్చే అవకాశాలున్నట్లు కనబడుతోంది.

 

ఇండియాకి ప్రధాని నరేంద్ర మోడీ, ఆంద్రప్రదేశ్ కి చంద్రబాబు నాయుడు, తెలంగాణకు కేసీఆర్ ‘చీఫ్ ఎక్సిక్యూటివ్ ఆఫీసర్స్’ వంటివారు. ఈ ఐదేళ్ళలో వారు దేశాన్ని, తమతమ రాష్ట్రాలను వేగంగా అభివృద్ధి చేయాలని ఆరాటపడుతున్నారు. అది చాలా స్పష్టంగానే కనబడుతోంది. ఇప్పుడు అమెరికాతో సహా ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపే చూస్తున్నాయి. గనుక అందరూ కలిసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడమే మంచిది.