అమెరికాలో ఫైజర్ వ్యాక్సిన్ తీసుకుని కుప్పకూలిన నర్సు..
Published on: Sat Dec 19, 2020 5:29PM
కరోనా మహమ్మారితో సతమతమౌతున్న అమెరికాలో వైరస్ వ్యాప్తి నుండి ప్రజలను కాపాడేందుకు అక్కడి ప్రభుత్వం ఫైజర్ వ్యాక్సిన్ కు అనుమతి ఇచ్చిన సంగతి తెల్సిందే. దీంతో అక్కడ వైద్య సిబ్బందికి వ్యాక్సినేషన్ కార్యక్రమం చురుగ్గా సాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా టెన్నిస్సీలోని ఓ నర్సు కు ఫైజర్ టీకా ఇచ్చిన కొద్దిసేపటికే ఆమె కుప్పకూలడం ఆందోళనకు గురిచేసింది.
ఫైజర్ బయోఎన్‌టెక్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ కరోనా వ్యాక్సిన్ కు ఇటీవలే అత్యవసర వినియోగ అనుమతులు లభించాయి. దీంతో అమెరికా వ్యాప్తంగా వ్యాక్సిన్ కేంద్రాలను ఏర్పాటు చేసి వ్యాక్సినేషన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చట్టనూగాలోని సీహెచ్ఐ మెమోరియల్ ఆసుపత్రి హెడ్ నర్సు టిఫానీ డోవర్‌కు మొదటి వ్యాక్సిన్ షాట్ ఇచ్చారు. వ్యాక్సిన్ తీసుకున్న తరువాత ఆమె ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కరోనా వ్యాక్సిన్ తీసుకున్నందుకు తనకు ఆనందంగా ఉందని చెప్పిన ఆమె ఒక్కసారిగా తలపట్టుకుని ‘‘క్షమించండి, నాకు అసౌకర్యంగా అనిపిస్తోంది’’ అని చెబుతూనే కుప్పకూలిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. దీంతో ఈ సమావేశాన్ని కవర్ చేస్తున్నమీడియా కెమెరాలు ఈ దృశ్యాన్ని చిత్రీకరించాయి. అయితే పక్కనే ఉన్న వైద్య సిబ్బంది ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం టిఫానీ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఏ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


