అమెరికా రెండో విడత క్షిపణి దాడులు.. ఇరాన్ ప్రతిదాడులు.!
Published on: Thu Jul 16, 2026 8:45AM

పశ్చిమ ఆసియాలో యుద్ధ జ్వాలలు ఎగసిపడుతున్నాయి. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు పీక్స్ కి చేరాయి. ఇరాన్ లక్ష్యంగా అమెరికా సైన్యం రెండో విడత వైమానిక, క్షిపణి దాడులు చేపట్టింది. హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకల రక్షణే ధ్యేయంగా ఈ దాడులు చేస్తున్నట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. అమెరికా సైన్యం బుధవారం (జులై 15) తెల్లవారుజామున ఒకసారి, మధ్యాహ్నం మరోసారి రెండు విడతలుగా ఇరాన్ సైనిక స్థావరాలపై క్షిపణులతో విరుచుకుపడ్డాయి.
అమెరికా వైమానిక దళం గ్రేటర్ టున్బ్ ద్వీపంలోని ఇరాన్ తీరప్రాంత రక్షణ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు నిర్వహించింది. ఇరాన్‌కు చెందిన క్రూజ్ క్షిపణుల నిల్వ కేంద్రాలు, క్షిపణి ప్రయోగ కేంద్రాలపై అమెరికా యుద్ధ విమానాలు క బాంబుల వర్షం కురిపించాయి. మొదటి విడత దాడి దాదాపు గంటన్నర సేపు సాగింది. అనంతరం, హర్మూజ్ జలసంధిలో ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని పూర్తిగా దెబ్బతీసేందుకు అమెరికా నావికా, వైమానిక దళాలు రెండో విడత దాడులకు పాల్పడ్డాయి. ఇరాన్ నౌకాశ్రయాలపై అమెరికా నావికా దళం ఆంక్షలను పునరుద్ధరించిన నేపథ్యంలో ఈ తాజా దాడులు చోటుచేసుకోవడం గమనార్హం.
అమెరికా జరిపిన ఈ భీకర దాడులకు ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ కూడా అంతే దీటుగా స్పందించింది. అమెరికాపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఇరాన్ సైన్యం జోర్డాన్, బహ్రెయిన్లలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులకు తెగబడింది. జోర్డాన్‌లోని అల్-అజ్రక్ అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్ జరిపిన భారీ దాడిలో అక్కడ నిలిపి ఉంచిన అమెరికాకు చెందిన అత్యాధునిక ఎఫ్-15, ఎఫ్-16, అలాగే ఎఫ్-35 యుద్ధ విమానాలతో పాటు ఎంక్యూ-9 వ్యూహాత్మక డ్రోన్లు భారీ సంఖ్యలో ధ్వంసమయ్యాయి.
మరోవైపు.. బహ్రెయిన్‌లోని అమెరికా ఐదో నౌకాదళ స్థావరాన్ని కూడా ఇరాన్ ఐఆర్‌జీసీ బలగాలు క్షిపణులతో టార్గెట్ చేశాయి. బహ్రెయిన్ లోని అమెరికా బేస్ లో ఉన్న ఇంధన నిల్వ కేంద్రాలు, సైనిక సామగ్రిని దాచిన పెద్ద పెద్ద గిడ్డంగులపై ఇరాన్ సైన్యం క్షిపణులతో చేసిన దాడుల్లో.. భారీ ఆస్తి నష్టం సంభవించింది.
US airstrikes on Iran, Strait of Hormuz conflict, Iran missile retaliation, Jordan US military base attack, IRGC attacks Bahrain base


