TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రష్యా నుంచి క్రూడ్ అయిల్ దిగుమతికి యూఎస్ గ్రీన్ సిగ్నల్

Published on: Tue May 19, 2026 3:18PM

చమురు కష్టాల్లో ఉన్న భారత్‌కు ఊరట

రష్యా నుంచి ముడి చమురు కొనుగోలుపై అమెరికా మినహాయింపులు పొడిగించింది. పశ్చిమాసియా సంక్షోభం,అంతర్జాతీయ మార్కెట్లో చమురు సరఫరా అంతరాయాల నేపథ్యంలో రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకోవడానికి భారతదేశానికి అమెరికా మరో నెల రోజులు  గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొదట మార్చి 2026 లో 30 రోజుల పాటు ఇచ్చిన ఈ ప్రత్యేక ఆంక్షల మినహాయింపును..  ఆ తర్వాత మే 16 వరకు పొడిగించారు. అది కేవలం సముద్రంలో నౌకల్లో నిలిచిపోయిన రష్యా చమురు ట్యాంకర్ల నుంచి మాత్రమే కొనుగోలు చేయడానికి వర్తిస్తుందని అమెరికా స్పష్టం చేసింది.

దీనివల్ల రష్యాకు కొత్తగా ఆర్థిక ప్రయోజనం చేకూరదనీ..  కేవలం అంతర్జాతీయ మార్కెట్లో చమురు సరఫరాను పెంచడమే తమ లక్ష్యమని పేర్కొంది.  అమెరికా నిర్ణయంతో భారత తీరానికి సమీపంలో నిలిచిపోయిన సుమారు 15 మిలియన్ బ్యారెళ్ల రష్యన్ ముడి చమురును ఇండియన్ రిఫైనరీలు సులభంగా దిగుమతి చేసుకోగలిగాయి. దీనివల్ల దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగకుండా కొంతవరకు నియంత్రించారు.

 అమెరికా ఇచ్చిన ఈ తాత్కాలిక ఆంక్షల మినహాయింపు గడువు మే 16తో ముగిసింది. గ్లోబల్ ఎనర్జీ సంక్షోభం కొనసాగుతున్నందున ఈ మినహాయింపును మరింత పొడిగించాలని భారత్ అమెరికాను కోరింది. మరోవైపు..  అమెరికా మినహాయింపులతో సంబంధం లేకుండా   దేశ ఇంధన భద్రత దృష్ట్యా రష్యా నుంచి చమురు దిగుమతులను నిరంతరాయంగా కొనసాగిస్తామని భారత ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. ఆ క్రమంలో జూన్ 17 వరకు చమురు దిగుమతులపై ఆంక్షలకు అమెరికా మినహాయింపు ఇచ్చింది.  దాంతో చమురు కష్టాల్లో ఉన్న భారత్‌కు ఒకింత ఊరట లభించింది.