TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

అఫ్గ‌న్‌ను వీడిన అమెరికా.. లాస్ట్‌లో తాలిబ‌న్ల‌కి ట్విస్ట్ ఇచ్చిన ఆర్మీ..

Published on: Tue Aug 31, 2021 2:52PM

20 ఏళ్లు. రెండు ద‌శాబ్దాల పాటు అఫ్గ‌నిస్తాన్‌ను కాపాడిన అమెరికా.. ఇక సెల‌వంటూ.. మ‌ళ్లీ తిరిగిరామంటూ కాబుల్‌కు అల్విదా చెప్పేసి వెళ్లిపోయింది. ఆ దేశాన్ని తాలిబ‌న్ల‌కు వ‌దిలేసి.. తన దారి తాను చూసుకుంది. సైనికులు, పౌరులతో కూడిన చివరి విమానం లార్జ్‌ సీ-17 కాబుల్‌లోని హమీద్‌ కర్జాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సోమవారం అర్ధరాత్రి బయలుదేరడంతో అఫ్గన్ భూభాగం నుంచి అమెరికా సైన్యం ఉపసంహరణ పూర్తయ్యింది. ముందే నిర్దేశించుకున్న ఆగస్టు 31 గడువుకు ఒక రోజు ముందే త‌న‌ బలగాలను పూర్తిగా తరలించేసింది. తాలిబ‌న్లు అఫ్గ‌నిస్తాన్‌ను ఆక్ర‌మించుకున్నాక‌.. ఇప్ప‌టి వ‌ర‌కూ సుమారు ల‌క్ష‌న్న‌ర మంది పౌరుల‌ను సుర‌క్షితంగా ఆ దేశం నుంచి షిఫ్ట్ చేసింది. ఇంకా చాలామందినే త‌ర‌లించాల్సి ఉన్నా.. తాలిబ‌న్లు విధించిన గ‌డువు ముగియ‌డం.. ఐసిస్ ఉగ్ర‌దాడుల భ‌యంతో ఒక్క రోజు ముందే అమెరికా సైన్యం ఆ దేశాన్ని వీడి వెళ్లిపోయింది. అఫ్గ‌న్‌లో 20 ఏళ్ల అమెరికా అధ్యాయం ముగిసింది. 

వెళ్తూ వెళ్తూ అమెరికా ఆర్మీ అఫ్గ‌న్‌లో ఉన్న త‌మ దేశ యుద్ధ విమానాలు, అత్యాధునికి క్షిప‌ణి ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌, సైనిక ప‌రిక‌రాల‌ను నిర్వీర్యం చేసి వెళ్లారు. కాబూల్‌లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉన్న 73 యూఎస్‌ యుద్ధ విమానాలను నిరుపయోగంగా మార్చేసి.. తుక్క‌గా చేశారు. 

‘తాలిబన్ అధీనంలోకి అఫ్గన్ వెళ్లడంతో అక్కడ నుంచి రావడానికి ముందే అమెరికా సైన్యాలు వీటిని నిర్వీర్యం చేశారు.. ఆ యుద్ధ విమానాలు ఎప్పటికీ ఎగరలేవు.. వాటి ఏ ఒక్కరూ నడపలేరు.. వాటిలో చాలా వరకూ యుద్ధం మొదలుపెట్టగల సామర్థ్యం కలిగి ఉన్నాయి.. కానీ ఖచ్చితంగా మళ్లీ ఎగరలేవు’ అని అమెరిక‌న్ ఆర్మీ అధికారి తెలిపారు. 

కాబుల్ విమానాశ్రయంలో 6,000 మంది సైనికులతో అమెరికా రెండు వారాలుగా తరలింపు ప్రక్రియ చేప‌ట్టింది. అక్క‌డ‌ మిలియన్ డాలర్ల విలువైన 70 ఎంఆర్ఏపీ యుద్ధ వాహనాలను వదిలిపెట్టింది. రాకెట్, మోర్టార్, ఆయుధాల దాడులను సమర్థంగా ఎదుర్కొనే సీ-రామ్ వ్యవస్థను కూడా అక్కడే వదిలేసింది. ఆ వ్యవస్థలను చివరి నిమిషం వరకూ ఉప‌యోగించిన అమెరికా.. చివ‌రి విమానం టేకాఫ్ అయ్యే స‌మ‌యానికి వాటిని కూడా ప‌నికిరాకుండా చేసి వెళ్లిపోయింది. 

తీవ్ర శత్రుత్వం ఉన్నప్పటికీ అఫ్గన్‌ నుంచి అమెరికా దళాలు, పౌరుల ఉపసంహరణలో తాలిబన్లు చాలా సహకరించారని, ఉపయుక్తంగా ఉన్నారని అమెరికా సైనికాధికారి తెలిపారు. ఇక‌, 20 ఏళ్ల త‌ర్వాత‌ అమెరికా దళాలు అఫ్గానిస్థాన్‌ను పూర్తిగా ఖాళీ చేయడంతో తాలిబన్లు తుపాకులతో గాల్లోకి కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. దీంతో.. 20 ఏళ్ల రాజ‌కీయ ఉత్కంఠ ముగిసిన‌ట్టైంది. అయితే, 20 ఏళ్ల క్రితం తాలిబ‌న్ల ఏరివేత‌తో మొద‌లైన శాంతిప్ర‌క్రియ.. ఇప్పుడు మ‌ళ్లీ ఆ తాలిబ‌న్లే అఫ్గ‌నిస్తాన్‌ను చేజిక్కించుకోవ‌డంతో ముగియ‌డం.. ఊహించ‌ని ప‌రిణామం. అమెరికా-అఫ్గ‌న్‌ల‌ వైఫ‌ల్యానికి నిద‌ర్శ‌నం.