భారత్ దగ్గర పాక్ నోరు మూయించే ఆధారాలు..

18 మంది జవాన్ల ప్రాణాలను బలిగొన్న యూరీ ఘటన సూత్రధారి పాకిస్థానే అని భారత్‌ వాదిస్తూ వస్తోంది. అయితే దానితో తమకు సంబంధం లేదని పాక్ గట్టిగా చెబుతోంది. ఈ నేపథ్యంలో దాయాది నోరు మూయించే గట్టి ఆధారాన్ని భారత్ సంపాదించింది. యూరి ఘటనపై దర్యాప్తు జరుపుతోన్న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వద్ద కీలక ఆధారాలున్నాయి. ఈ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులు వాడిన వైర్‌లెస్ సెట్స్ ఇప్పుడు పాక్‌ను ఇరుకునపెట్టునున్నాయి.

జపాన్‌లో తయారైన ఈ వైర్‌లెస్ సెట్స్‌పై బిల్‌కుల్ నయా అని ఉర్దూలో రాసి ఉంది. వీటిని తయారు చేసిన ఐకామ్ కంపెనీ నుంచి కొనుగోలుకు సంబంధించిన వివరాలను ఎన్ఐఏ అధికారులు ఇప్పటికే తీసుకున్నారు. సాధారణంగా దేశాల భద్రతా సంస్థలకు మాత్రమే అమ్మే ఈ పరికరాలు ఉగ్రవాదుల దగ్గరకు ఎలా వచ్చాయన్న సందేహం కలుగుతోంది. వీటితో పాటు మరణించిన ఉగ్రవాదుల నుంచి రెండు మ్యాపులు, ఆహార పదార్థాలు, జీపీఎస్ పరికరాలు, మొబైల్స్ ఫోన్స్ ఉన్నాయి. వారు వాడిన ఆహార పదార్థాలు, జ్యూస్‌లు కరాచీలో తయారైనట్లు స్పష్టంగా ఉంది. వీటి ద్వారా ఉగ్రవాదులు ఎక్కడి వారో సులువుగా అర్థమవుతోంది. ఈ ఆధారాల సాయంతో అంతర్జాతీయ సమాజం ముందు పాక్‌ నిజస్వరూపాన్ని బయటపెట్టవచ్చు.