జర్నలిస్టు యూనియన్లపై వత్తిడి తెచ్చిన సాక్షి యాజమాన్యం
Published on: Sat May 12, 2012 11:06AM
ఎద్దు ఈనిందంటే గుంజకు కట్టేయండి అనే రీతిలో విచక్షణ లేకుండా పాత్రికేయ సంఘాలు వ్యవహరించడంపై ప్రజలు చర్చించుకుంటున్నారు. సాక్షి పత్రికా బ్యాంక్ అకౌంట్లను స్తంభింప చేస్తున్నట్లు సిబీఐ ప్రకటించాడంతోనే పాత్రికేయ సంఘాలు పోటీపడి ఖండించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. రాష్ట్ర్రంలో అతిపెద్ద పాత్రికేయ సంఘం ఎపియుడబ్ల్యూజె (యూనియన్) కాగా దీనికి పోటీగా ఆ సంఘం నుంచే బయటకు వచ్చిన జి.ఆంజనేయులు నేతృత్వంలో ఏర్పడిన మరో సంఘం ఎపిఎఫ్ డబ్ల్యూజె (దీన్ని ఫెడరేషన్ అంటారు). ఎపియుడబ్ల్యూజె ఆధిక్యతను దెబ్బతీయడం ద్వారా తమ ఫెడరేషన్ ను బలపర్చుకోవడానికి విచక్షణా రహితంగా అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకొనే ప్రయత్నంలో భాగంగా సాక్షి పత్రిక అకౌంట్లు సీజ్ చేసిన వెంటనే పత్రికా స్వేచ్చపై దాడి అంటూ ఫెడరేషన్ నేతలు ముందుకు వచ్చారు.
సిబీఐ పత్రికల్లో ప్రచురితమయ్యే వార్తలపై లేదా వ్యాసాలపై ఎటువంటి ఆంక్షలు విధించలేదు. అయినా తమ సంస్థ మనుగడకోసం పత్రికా స్వేచ్ఛ అంటూ ఫెడరేషన్ నేతలు తొలిరోజు ఆందోళనకు దిగారు. ఫెడరేషన్ చర్యలను గమనించిన ఎపియుడబ్ల్యూజె నేతలు తమ యూనియన్ ప్రాధాన్యత ఎక్కడ తగ్గిపోతుందోనని వారు కూడా రంగంలోకి రెండో రోజున ఆందోళన చేశారు.
ఈ రెండు సంఘాల మధ్య వున్న పోటీని ఆసరా చేసుకుని సాక్షి యాజమాన్యం మీరు రాకపోతే ఫెడరేషన్ నాయకులు వస్తామన్నారు అంటూ ఎపియుడబ్ల్యూజె నేతలపై వత్తిడి తెచ్చింది. మరోవైపు ఫెడరేషన్ నాయకుడు జి.ఆంజనేయులుకు ఫోన్ చేసి మీరు ముందుకు వస్తే మా సిబ్బంది మొత్తం మీ ఫెడరేషన్ వైపు వస్తారంటూ ఫెడరేషన్ నాయకులకు ఫోన్లు చేశారు. సంఘాల మధ్య పోటీ, తమ సంఘాల మనుగడ గురించి ఆలోచించడం మినహా నిజంగా పత్రికా స్వేచ్చకు భంగం కలిగిందా? అనే విచక్షణ పాత్రికేయ నేతలలో కనిపించడం లేదు. ఎపియుడబ్ల్యూజె యూనియన్ కు సంబంధించిన దేవులపల్లి అమర్ సాక్షి పత్రికలో ఉద్యోగిగా వుంటే ... శ్రీనివాసులు రెడ్డి వంటి నాయకులు వై.ఎస్. హయాంలో అనేక మేళ్ళు పొందడంతోపాటు ప్రస్తుతం జగన్ కు సలహాదారులుగా వున్నారు.


