ఉప్పీ వీళ్లు గుర్తున్నారా..?

సినిమాల్లో అవకాశాలు రాకపోకడమో.. వయసు మీద పడటమో.. కారణం ఏదైనా కానీ సినీతారల అంతిమ మజిలీ రాజకీయాలు అని ప్రస్తుతం రుజువవుతోంది. అప్పట్లో ఎన్టీఆర్, ఎమ్జీఆర్‌లు రాజకీయ బాట నడిచారంటే అది ఒక చారిత్రక అవసరం.. కానీ నేడు రాజకీయాల్లోకి వస్తున్న వారికి.. రావాలనుకుంటున్న వారికి స్పష్టమైన కారణం అంటూ ఏది ఉండటం లేదు. సరే ఆ సంగతి పక్కనబెడదాం.. తమిళ తలైవా, సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లో రావాలనుకుంటున్నారని ప్రకటించడం ఆ రాష్ట్ర రాజకీయ వర్గాలను ఒక కుదుపు కుదిపింది.

 

దానికి తోడు వరుసపెట్టి అభిమాన సంఘాలతో సమావేశాలు నిర్వహిస్తూ వచ్చారు.. సరిగ్గా ఇదే సమయంలో రజినీ సమాకాలీకుడు మరో సూపర్‌స్టార్ కమల్ హాసన్ కూడా తాను పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించడంతో తమిళనాట ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. అయితే ఇద్దరి రాజకీయ అరంగేట్రం గురించి వార్తలు వస్తున్నాయి తప్ప పార్టీ ప్రకటించబోతున్నట్లు గానీ.. ప్రస్తుతమున్న ఏదో ఒక రాజకీయ పార్టీకి మద్ధతు ఇస్తున్నట్లు గానీ చెప్పిన దాఖలాలు మాత్రం లేవు. అయితే ఈ విషయంలో రజనీకాంత్‌తో పోలిస్తే లోక నాయకుడు కాస్తలో కాస్త బెటర్. వీరిద్దరిలానే తాను కూడా రాజకీయాల్లోకి రాబోతున్నట్లు ప్రకటించాడు కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర. నటనతో పాటు.. తన సినిమాల ద్వారా సమాజంలోని కుళ్లునీ.. సమస్యలను ఎత్తిచూపుతూ కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఈయనకు ఒక్క కర్ణాటకలోనే కాదు.. తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

 

మరి అలాంటి వ్యక్తి రాజకీయాల్లోకి వస్తున్నాడంటే సహజంగానే భారీ అంచనాలుంటాయి. ఇందుకు తగినట్లుగానే సోషల్ మీడియా వేదికగా జనాన్ని తనవైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు ఉప్పీ దాదా. ముందుగా చెప్పినట్లుగానే ఇవాళ బెంగళూరులో తన పార్టీని ప్రకటించాడు. తాను జన నాయకుడిని.. జన సేవకుడిని కాదని.. జన కార్మికుడిననే అర్థం వచ్చేలా ఖాకీ చొక్కా వేసుకొచ్చిన ఆయన పార్టీ పేరుగా కర్ణాటక ప్రజ్ఞావంత జనతాపక్ష పార్టీ అని నామకరణం చేశారు. అందరికీ విద్య, ఆరోగ్య భీమా, మౌళిక సదుపాయాలు, చిన్న పరిశ్రమలకు ప్రోత్సాహం తదితరాలు పార్టీ ఎజెండాలోని ముఖ్యాంశాలు. ఇది తన పార్టీ కాదని.. ప్రజల పార్టీ అని తెలిపారు. ప్రజల కోసం తాను ఒక వేదికను మాత్రమే సిద్ధం చేశానని.. తన లక్ష్యాలు నచ్చిన వారంతా దీనిలో భాగస్వాములు కావొచ్చని చెప్పారు.

 

కానీ ఉపేంద్ర ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. రాజకీయాల్లోకి వచ్చిన సినీనటులు అందరూ సక్సెస్ కాలేదన్నది వాస్తవం. చిరంజీవి అట్టహాసంగా ప్రజారాజ్యం పార్టీని స్థాపించి.. సరిగా నడపలేక పార్టీని కాంగ్రెస్‌లో కలిపేశారు. ఆ తర్వాత అంతటి ప్రజాదరణ ఉన్న పవన్‌కళ్యాణ్‌ జనసేన పార్టీని స్థాపించారు. ఎప్పుడో మూడేళ్ల క్రితం ఏర్పడిన ఈ పార్టీకి సిద్ధాంతాలు ఏంటో పవన్‌ కళ్యాణ్‌కి తప్ప మరేవ్వరికీ తెలియవు.. ఇంతవరకు వ్యవస్థాగత నిర్మాణం గానీ జరగలేదు.. అలాగే తమిళనాట కెప్టెన్ విజయ్‌కాంత్ పార్టీ ఏమైందో అందరికీ తెలిసిందే. కాబట్టి వీటిని గుణపాఠాలుగా తీసుకొని.. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా పార్టీని నడిపిస్తే ఏనాటికైనా విజయం తథ్యం.. అలా కాకుండా సమస్యలకు లొంగిపోతే.. అసలుకే మోసం వస్తుంది. సో బీ కేర్ ఫుల్.. అండ్ ఆల్‌ ది బెస్ట్.