TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

4 నెలలకో కొత్త వేరియంట్‌!.. ఒమిక్రాన్ XEతో మ‌రింత డేంజ‌ర్‌?

Published on: Sat Apr 9, 2022 7:29PM

ఒమిక్రాన్ వెళ్లిపోయింది. ఒమిక్రాన్ XE పుట్టుకొచ్చింది. డెల్టా కంటే ఒమిక్రాన్ వ్యాప్తి ఎక్కువంటే.. ఒమిక్రాన్ కంటే ఒమిక్రాన్ XE ప‌ది రెడ్లు వేగంగా విస్త‌రిస్తోంది. ఇప్ప‌టికే చైనాను చుట్టేసింది. ఇండియాలోనూ ఎంట్రీ ఇచ్చింది. ఇక వివిధ దేశాల్లో ఏదో ఒక క‌రోనా వేరియంట్ ప్ర‌భావం చూపిస్తూనే ఉంది. ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌తీరోజూ 15 ల‌క్ష‌ల కొవిడ్ కేసులు వ‌స్తున్నాయంటే న‌మ్మాల్సిందే. జోరుగా వ్యాక్సినేష‌న్ జ‌రుగుతున్నా.. ఇప్ప‌టికీ అనేక కోట్ల మంది టీకాకు దూరంగానే ఉన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో మాత్రం బూస్ట‌ర్ మీద బూస్ట‌ర్ డోసులు వేస్తున్నారు. 

ఎన్ని టీకాలు వేసుకుంటున్నా.. కొత్త కొత్త వేరియంట్ల‌తో వైర‌స్ వ్యాపిస్తూనే ఉంది. జ‌నాన్ని క‌ల‌వ‌ర‌పెడుతూనే ఉంది. ఇప్ప‌ట్లో కొవిడ్ ఖ‌తం అయ్యే అవ‌కాశాలు లేవంటూ  యూఎన్‌ఓ జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెర్రస్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా ముగింపు దశలో లేదని హెచ్చరించారు. కరోనా వైరస్‌లో కొత్త వేరియంట్లు, వ్యాప్తి ఎంత వేగంగా ఉంటాయనే దానికి ఒమిక్రాన్ మనకొక రిమైండర్ అంటూ అల‌ర్ట్ చేశారు గుటెర్రస్. 

చైనాతో సహా అమెరికా, ఐరోపా దేశాల్లో క‌రోనా మరో దఫా విజృంభిస్తోంది. ఆసియాలో మహమ్మారి ఉద్ధృతంగా ఉంది. కొన్ని దేశాల్లో ప్రస్తుతం అత్యధిక మరణాలు నమోదవుతుండ‌టం ఆందోళ‌న‌క‌రం. సగటున ప్రతి 4 నెలలకు ఒక కొత్త వేరియంట్ వెలుగుచూస్తుండ‌టంతో.. ప్రభుత్వాలు, ఫార్మా సంస్థలు ఈ విష‌యంలో మ‌రింత స‌మ‌ర్థ‌వంతంగా పనిచేయాల్సిన అవ‌స‌రాన్ని సూచిస్తోంద‌ని నిపుణులు చెబుతున్నారు. 

అందుకే, క‌రోనా లేదు, గిరోనా లేదంటూ బిందాస్‌గా ఉండ‌కుండా.. ఎప్ప‌టిలానే జాగ్ర‌త్త‌గా ఉండాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉందంటున్నారు. ఇప్పుడే ఇండియాలో అడుగుపెట్టిన‌ ఒమిక్రాన్ XE.. రానున్న రోజుల్లో మ‌ళ్లీ కొత్త వేవ్‌తో విరుచుకుప‌డ‌టం ఖాయంగా క‌నిపిస్తోంది.