TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అమ్మాయిలపై లైంగిక దాడులకు కారణం ఇదేనట!

Published on: Thu Jun 10, 2021 3:37PM

మహిళల రక్షణ కోసం రాజ్యాంగంలో ఎన్నో చట్టాలు ఉన్నాయి. కొత్తగా మరింత కఠినమైన చట్టాలను తీసుకొచ్చారు పాలకులు. అమ్మాయిల భద్రత కోసమే ప్రత్యేక పథకాలను అమలు చేస్తున్నారు. అయినా దేశంలో మహిళలపై లైంగిక దాడులు ఆగడం లేదు. అత్యాచారాలకు సంబంధించిన ఘటనలు ప్రతి రాష్ట్రంలో .. ఇంకా చెప్పాలంటే మన దగ్గరలోనే నిత్యం వెలుగులోనికి వస్తున్నాయి. అయితే అమ్మాయిలపై లైగింక దాడులకు సంబంధించి మహిళల భద్రత చూడాల్సిన పదవిలో ఉన్న మహిళ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. 

అమ్మాయిలు అతిగా ఫోన్లు వాడడం వల్లే అత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్నాయని ఉత్తరప్రదేశ్ మహిళా కమిషన్ సభ్యురాలు మీనా కుమారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అలీగఢ్ జిల్లాలో మహిళా ఫిర్యాదులపై విచారణల సందర్భంగా ..  ఫోన్ల వినియోగంపై మాట్లాడుతూ ఆమె ఈ కామెంట్ చేశారు.  అమ్మాయిలు ఫోన్లు వాడొద్దని అన్నారు. తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లులు.. తమ కూతుర్లను జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. కూతుర్లు నిర్లక్ష్యంగా ఉంటున్నారంటే దానికి కారణం తల్లుల నిర్లక్ష్యమేనన్నారు

‘‘అమ్మాయిలకు అసలు ఫోన్లు ఇవ్వొద్దు. గంటలకొద్దీ అబ్బాయిలతో బాతాఖానీలు కొడుతున్నారు. ఆ తర్వాత వారితో కలిసి పారిపోతున్నారు. తల్లిదండ్రులు వారి ఫోన్లను చెక్ చేయకపోవడం వల్ల ఇలాంటి విషయాలు తెలియడం లేదు’’ అని ఆమె అన్నారు. మహిళలపై పెరుగుతున్న నేరాలపై సమాజం కూడా ప్రభావం చూపిస్తోందన్నారు. మీనా కుమారి వ్యాఖ్యలపై స్పందించిన కమిషన్ వైస్ చైర్ పర్సన్ అంజూ చౌదరి.. ఫోన్లను లాక్కున్నంత మాత్రాన మహిళలపై లైంగిక హింస ఆగదన్నారు.