TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బీజేపీకి బీజేపీ నేతలే శత్రువులా..?

Published on: Sat Jul 23, 2016 5:45PM


శత్రువులు ఎక్కడో ఉండర్రా.. మనకు తెలిసిన వాళ్ల రూపంలోనే.. మనచుట్టూనే తిరుగుతుంటారు.. ఇదేదో సినిమా డైలాగ్ లా ఉంది కదా. సినిమా డైలాగే.. కానీ ఇప్పుడు ఇది సరిగ్గా మన బిజేపీ నేతలకు సూటయ్యేలా కనిపిస్తోంది. ఎందుకంటే.. వారు చేసే పనులు అలా ఉన్నాయి కాబట్టి. ఎప్పుడూ ఏదో ఒక విషయంలో ఏదో ఒక రచ్చ చేస్తూనే ఉంటారు. అయితే అదేంటో తెలియదు కానీ సరిగ్గా ఎన్నికల సమయం అప్పుడే వారు తమ నోటికి పని చెబుతుంటారు. తమ గొయ్యి తామే తవ్వుకుంటున్నారు.

 

గతంలో బీహార్ ఎన్నికలప్పుడు కూడా అంతే.. ఎలాగైనా సరే ఎన్నికల్లో గెలవాలని అధికారం చేపట్టాలని గట్టి వ్యూహాలే రచించింది. అయితే బీఫ్ ఇష్యూని తెరపైకి తీసుకొచ్చి నానా రభన చేసింది. ఈ గోమాంసం ఇష్యూ దేశ వ్యాప్తంగా ఎంతగా సెగలు రేపిందో తెలిసిందే. ఇదే ఆ ఎన్నికల ఓటమికి పెద్ద మైనస్ అయింది. దీనికి తోడు ఆ ఎన్నికల బరిలో దిగిన నేతలపై క్రిమినల్ కేసులు ఉన్నాయని బయటపడ్డాయి. అదొక్కటే కాదు దేశవ్యాప్తంగా అసహనం అనే కాన్సెప్ట్ కూడా బీజేపీ ఓటమికి కారణమైంది. ఇలా పలు కారణాలు బీజేపీ ఓటమికి కారణమయ్యాయి.

 

ఇప్పుడు చూడబోతే యూపీ ఎన్నికల్లో కూడా అదే రిపీట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. త్వరలో జరగబోయే యూపీ ఎన్నికలకు అన్ని పార్టీలు తమ వ్యూహాలు రచించుకుంటున్నాయి. ఎలాగైనా సరే ఎన్నికల్లో గెలవాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమయంలో బీజేపీ కూడా బాగానే కష్టపడుతోంది. ఎలాగంటారా.. అన్ని వివాదాల్లో చిక్కుకొని. ఈ మధ్య కాలంలో జరిగిన వేముల రోహిత్ ఆత్మహత్య.. హెచ్సీయూ యూనివర్శిటీ ఉదంతం.. ఇవన్నీ బీజేపీకి తలనొప్పి తెచ్చే వ్యవహారాలే. ఇప్పుడు తాజాగా గుజరాత్ లో దళితులపై దాడి విషయంలో బీజేపీపై విపక్షాలు మండిపడుతున్నాయి. దీనిపై బీజేపీ సమాధానం చెప్పాల్సిందే అని ఒకపక్క పార్లమెంట్ అట్టుడుకుతోంది. దానికి ఆజ్యం పోస్తున్నట్టు ఆ పార్టీ నేత దయాకర్ సింగ్ బీఎస్పీ అధినేత మాయావతిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి ఆ పార్టీకి కొత్త తలనొప్పులు తీసుకొచ్చారు. అయితే పార్టీ నుండి ఆయన్ని సస్పెండ్ చేసినా... ఆయన చేసిన వ్యాఖ్యల సెగ మాత్రం ఇంకా రగులుతూనే ఉంది. యూపీలో బీఎస్పీ కార్యకర్తలు దయాకర్ సింగ్ దిష్టిబొమ్మలు తగలబెడుతూ.. పెద్ద ఎత్తున నిరసలు తెలుపుతున్నారు.

 

మరి వచ్చే ఏడాదిలో యూపీ ఎన్నికలు జరగనున్నాయి. మరి ఇలాంటి సమయంలో ఆచితూచి మాట్లాడుతూ.. ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సింది పోయి బీజేపీ పార్టీ లేనిపోని కష్టాలను కొనితెచ్చుకుంటుంది. బీజేపీ నేతలే బీజేపీని కష్టాల్లోకి నెడుతున్నారు. రైట్ టైంలో.. రాంగ్ స్టేట్ మెంట్స్.. పనలు చేస్తూ పార్టీని ఓటమికి కారణమవుతున్నారు. మరి ఇప్పటికే వారు మారి తమ నోటికి తాళాలు వేసుకుంటారా..లేక ఇలానే చేసి బీహార్ ఎన్నికల ఫలితాన్నే మూటగట్టుకుంటారా.. చూడాలి