అఖిలేశ్ ప్లాన్ కు ఎదురుదెబ్బ..

 

అఖిలేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఉత్తరప్రదేశ్ లో వెనుకబడిన బీసీ కులాలను ఎస్సీ కేటగిరీలో చేర్చాలని అఖిలేశ్ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇందుకు గాను ప్రభుత్వం జీవో కూడా జారీ చేసింది. అయితే ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కోర్టు బ్రేక్ వేసింది.  ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై అలహాబాద్‌ హైకోర్టు మంగళవారం స్టే ఇచ్చింది. కాగా కహర్‌, కశ్యప్‌, కేవత్‌, నిషాద్‌, బింద్‌, భర్‌, ప్రజాపతి, బథం, గౌర్‌, తురా, మాఝీ, మలా, కుమ్హార్‌, ధీమర్‌, మచువా తదితర కులాలకు ఎస్సీ కేటగిరిలో చేర్చాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ద్వారా ఈ కులాలకు లబ్దిచేకూరినట్లైంది. విచిత్రం ఏమంటే, 2004లోనూ నాటి సీఎం ములాయం ఇవే బీసీ ఉప కులాలను ఎస్సీ కేటగిరీలోకి చేర్చేందుకు జీవోను జారీచేశారు. అప్పుడు కూడా హైకోర్టు జోక్యంతోనే ఆ ఆదేశాలు చెల్లుబాటుకాలేదు. మొత్తానికి యూపీలో త్వరలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎస్పీకి పెద్ద ఎదురుదెబ్బే తగిలింది. దీంతో బీసీలను ఆకట్టుకోవాలనుకున్న అఖిలేశ్‌ ప్రయత్నాలకు గండిపడినట్లైంది.