చక్రం తిప్పిన ప్రియాంక.. ఎస్పీ, కాంగ్రెస్ పొత్తు..


సమాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చినట్టు కనిపిస్తోంది. మొదట రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరినట్టే అని కాంగ్రెస్ కీలక నేత గులాం నబీ ఆజాద్‌ ప్రకటించారు. అయితే ఆ తరువాత ఏమైందో ఏమో తెలియదు కానీ...సమాజ్ వాదీ పార్టీ మాత్రం 210 మంది అభ్యర్థులతో తొలి జాబితాను సమాజ్ వాదీ పార్టీ ప్రకటించడం.. అందునా అమేథీ, రాయ్ బరేలీ పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో కూడా ఎస్పీ తన అభ్యర్థులను ప్రకటించడంతో, కాంగ్రెస్ షాక్ అయింది. రెండు పార్టీల మధ్య పొత్తు లేనట్లే అని అందరూ భావించారు. ఇక దీంతో ఇక  సోనియా గాంధీ కూతురు, రాహుల్ గాంధీ సోదరి అయిన ప్రియాంక గాంధీ రంగంలోకి దిగి చక్రం తిప్పారు. ఆమె అఖిలేశ్ కు ఫోన్ చేసి పొత్తు కుదిరేలా చేశారు. దీంతో యూపీలో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలుండగా.. వాటిలో 298 స్ఠానాలు సమాజ్‌వాదీ పార్టీకి.. మిగిలిన 105 స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీ పోటీ చేసేందుకు అంగీకారం కుదిరింది. ఈ విషయాన్ని ఉత్తరప్రదేశ్‌ సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు నరేశ్‌ఉత్తమ్, యూపీసీసీ చీఫ్‌ రాజ్‌బబ్బర్‌ ఆదివారం లక్నోలో నిర్వహించిన సంయుక్త విలేకరుల సమావేశంలో వెల్లడించారు. రానున్న ఎన్నికల్లో ఎస్‌పీ, కాంగ్రెస్‌ ఉమ్మడిగా పోటీ చేస్తాయని, ఈ ఎన్నికల్లో తమ కూటమి ఘన విజయం సాధించి అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తుందని స్పష్టం చేశారు.