ఈ ఉపఎన్నికల్లో కూడా బీజేపీకి కష్టమే...

 

ఉత్తరప్రదేశ్ లో ఫుల్ పూర్, గోరఖ్ పూర్ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే కదా. ఇక ఈ ఫలితాల ఎన్నికలు కాసేపట్లో తెలియనున్నాయి. చూడబోతే ఈ ఉపఎన్నికల్లో కూడా బీజేపీకి ఓటమి తప్పేలా లేదనిపిస్తోంది. యూపీలో ఫుల్ పూర్, గోరఖ్ పూర్ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగగా, తొలుత రెండు చోట్లా ఆధిక్యంలో ఉన్న బీజేపీ, ప్రస్తుతం ఫుల్ పూర్ లో వెనుకంజలో ఉంది. ఈ నియోజకవర్గంలో బీఎస్పీ మద్దతుతో బరిలోకి దిగిన సమాజ్ వాదీ అభ్యర్థి నాగేంద్ర ప్రతాప్ సింగ్ విజయం దిశగా వెళుతున్నారు. ఇక, యోగి ఆదిత్యనాథ్ ఖాళీ చేసిన గోరఖ్ పూర్ లో మాత్రం బీజేపీ అభ్యర్థి కౌశలేంద్ర సింగ్ పటేల్ ముందంజలో ఉన్నారు.

 

కాగా గోరఖ్‌పూర్‌లో బీజేపీ 1991 నుంచి ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా ఓటమి చెందకపోవడం విశేషం.  రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఇక్కడి నుంచి 1998,1999,2004,2009,2014 వరుస ఎన్నికల్లో ఐదుసార్లు విజయం సాధించారు. 2014లో ఇక్కడి నుంచి గెలిచిన ఆదిత్యానాధ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగా, పూల్‌పూర్‌లో నుంచి  గెలిచిన కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య  రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఎన్నికవ్వడంతో  ఈ నెల 4వ తేదీన ఈ రెండు నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక జరిగింది.

 

ఇక బిహార్‌లోని ఒక లోక్‌సభ స్థానానికి, రెండు అసెంబ్లీ స్థానాలకు కూడా ఈరోజు కౌంటింగ్‌ జరుగుతోంది. అరారియా లోక్‌సభ స్థానం, జహానాబాద్‌ అసెంబ్లీ స్థానాల్లో తొలి రౌండ్ల ఫలితాల్లో లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు చెందిన ఆర్జేడీ పార్టీ ఆధిక్యంలో ఉంది. ఈ  రెండు స్థానాల్లో కూడా గత ఎన్నికల్లో ఆర్జేడీనే గెలిచింది. భబువా అసెంబ్లీ స్థానంలో భాజపా ఆధిక్యంలో కొనసాగుతోంది. గత ఏడాది భబువాలో భాజపా ఎమ్మెల్యే మరణించడంతో ఈ స్థానం ఖాళీ అయ్యింది.