ప్రియాంక డ్రెస్సింగ్ పై బీజేపీ ఎంపీ కామెంట్స్

 

ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఆమెకి కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి పదవితో పాటు తూర్పు యూపీ ప్రచార భాద్యతలను అప్పగించింది. ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడంతో కాంగ్రెస్‌లో సరికొత్త ఉత్సాహం కనిపిస్తోంది. దేశ రాజకీయాలన్నీ ఆమె చుట్టూనే తిరుగుతున్నాయి. ప్రియాంక గాంధీ రాకతో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఖచ్చితంగా లాభం జరుగుతుందని ఆ పార్టీ నేతలు చెబుతుంటే..ప్రత్యర్థి పార్టీలు మాత్రం ప్రియాంకని టార్గెట్‌ చేసి విమర్శలు గుప్పిస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ నేతలు ప్రియాంక గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ..కాంట్రవర్సీ పోస్టర్లు పెడుతూ.. దేశ రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. గతంలో ఆమెకు అందం తప్ప రాజకీయ అనుభవం లేదంటూ బీహార్ మంత్రి వినోద్ నారాయన్ ఝా విమర్శించారు. 

మరో బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ సైతం ప్రియాంక, రాహుల్‌ను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌ని రావణుడిగా, ప్రియాంక గాంధీని సూర్పణఖగా పోల్చడంపై తీవ్ర దుమారం రేగింది. అలాగే ప్రియాంక గాంధీని మహిశాసుర రాక్షసితో పోల్చుతూ ఇటీవల బారాబంకీలో పోస్టర్లు ఏర్పాటుచేశారు. అందులో బీజేపీ మహిళా నేత ప్రియాంక రావత్‌ను దుర్గా దేవిగా పేర్కొన్నారు. మహిశాసుర రూపంలో ఉన్న ప్రియాంక గాంధీని దుర్గా దేవి రూపంలో ఉన్న ప్రియాంక రావత్‌ చంపుతున్నట్లుగా ఫ్లెక్సీలు రూపొందించారు. కాగా తాజాగా మరో బీజేపీ ఎంపీ ప్రియాంక వస్త్రధారణపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. "రాహుల్ గాంధీ విఫలమయ్యారు. ప్రియాంక గాంధీ పరిస్థితి కూడా అంతే. ఆమె కూడా విఫలమవుతుంది. ఢిల్లీలో ప్రియాంక గాంధీ జీన్స్, టీషర్ట్ ధరిస్తుంది. కానీ సొంత నియోజకవర్గంలో మాత్రం చీర ధరిస్తారు. బొట్టు కూడా పెట్టుకుంటారు" అని వ్యాఖ్యానించారు.