యూపీలో రిలాక్స్.. గోవాలో టెన్షన్.. అధికారం ఎవరిదో?
Published on: Tue Mar 8, 2022 5:07PM
అసెంబ్లీ ఎన్నికల జరిగిన ఐదు రాష్ట్రాలలో అతి పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్’ అయితే అతి చిన్న రాష్ట్రం గోవా. ఉత్తర ప్రదేశ్’ లో మొత్తం 303 అసెంబ్లీ స్థానాలుంటే, గోవాలు ఉన్నది జస్ట్ ఫార్టీ (40) సీట్స్. గోవా చాలా చిన్న రాష్ట్రమే అయినా, ఇప్పుడు యూపీ ఫలితాల కంటే, గోవా ఫలితాల పైనే రాజకీయ వర్గాల్లో ఎక్కువగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడిన నేపధ్యంలో యూపీ ఫలితాలకు సంబంధించి ఒక విధమైన క్లారిటీ వచ్చింది. సీట్ల సంఖ్య అటూ ఇటూ అయినా, సుమారు 35 సంవత్సరాల తర్వాత, తొలి సారిగా, అధికార పార్టీ (బీజేపీ) తిరిగి అధికారంలోకి వస్తోందని, సిట్టింగ్ చీఫ్ మినిస్టర్ (యోగీ ఆదిత్య నాథ్) వరసగా రెండవ సారి ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని, ఎగ్జిట్ పోల్స్స్ ఫలితాలు సూచిస్తున్నాయి. నిజంగా, యూపీలో యోగీ మళ్ళీ అధికారంలోకి వస్తారా, లేదా అనేది మరో రెండు రోజుల్లో, మార్చి 10న తేలిపోతుంది. అసలు ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ, ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇచ్చిన ఇండికేషన్’తో యూపీ ఫలితాలపై ముందున్న ఉత్కంఠ ఇప్పుడు లేదు. కొంత సర్దుకుంది.
అయితే, ఎగ్జిట్ పోల్ ఫలితాలు చిన్న రాష్ట్రం గోవాలో హంగ్ సూచిస్తున్న నేపధ్యంలో అక్కడ ఏమి జరుగుతుంది? అనే విషయంలో కొంత ఉత్కంఠ ఇంకా కొనసాగుతోంది. అందుకు తగ్గట్టుగానే, ఇటు బీజీపీ, అటు కాంగ్రెస్ పార్టీలో ఎగ్జిట్ పోల్స్ నేపధ్యంగా, అప్పుడే పావులు కదుపుతున్నాయి. హంగ్ వస్తే ఏమి చేయాలి? ఆనే విషయంపై, కాంగ్రెస్, బీజేపీలు ఎవరి పంధాలో వారు ప్రయత్నాలు ప్రారంభించారు. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్’ ఎగ్జిట్ ఫలితాలు వెలువడిన వెంటనే ఢిల్లీ చేరుకున్నారు. పార్టీ అగ్ర నేతలతో చర్చలు జరుపుతున్నారు. అయితే, హంగ్ అసెంబ్లీ వచ్చినా అధికారం తమదే అని, తానే తిరిగి ముఖ్యమంత్రి అవుతానని సావంత్ ధీమా వ్యక్త పరిచారు. అవసరం అయితే మాజీ మిత్ర పక్షం మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ (ఏమ్జీపీ)ని వెనక్కి తెచ్చుకుని ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమాగా ఉన్నారు. ఆయన ధీమా చూస్తే ప్లాన్ ఏ’ ప్లాన్ బీ’నే కాదు ప్లాన్ జెడ్’ వరకు అనేక ప్రత్యన్మాయలతో సిద్దం ఉన్నట్లుందని పరిశీలకులు అంటున్నారు.
అయితే, 2017లో ఒక సారి చేయి కాల్చుకున్న హస్తం పార్టీ, ఈసారి మొదటి నుంచి జాగ్రత్తగా పావులు కదుపుతోంది. నిజానికి 2017లోనూ కాంగ్రెస్ పార్టీనే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ప్రజలు ఎన్నుకున్నారు. అయితే, హస్తం పార్టీ కళ్ళు తెరిచే సరికి కమల దళం, ఏమ్జీపీతో పాటుగా ఒకరో ఇద్దరో స్వతంత్ర అభ్యర్ధుల మద్దతు కూడగట్టి పీఠం ఎక్కి కూర్చుంది.
అయితే ఈ సారి కాంగ్రెస్ పార్టీ ముందుగానే జాగ్రత్త చర్యలు తీసుకుంది. గత ఎన్నికల సమయంలో ఎలక్షన్ ఇన్’ఛార్జ్ ఉన్న దిగ్విజయ్ సింగ్ స్థానంలో, ఈ సారి పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరంకు బాధ్యతలు అప్పగించింది. అంతే కాకుండా హంగ్ హింట్ రాగానే, కర్ణాటక పీసీసీ చీఫ్, రిసార్ట్ రాజకీయాలు దిట్ట్టగా పేరున్న, డీకే శివకుమార్’ను రంగంలోకి దింపింది. ఇప్పటికే గోవా చేరుకున్న శివ కుమార్, గోవాలో, రాజస్థాన్’లో రిసార్ట్స సిద్ధం చేసినట్లు సమాచారం. అయితే, కాంగ్రెస్ పార్టీ మేజిక్ ఫిగర్ (21) కు ఒకటీ అరా సీట్ల దూరం వరకు వస్తే ఓకే కానీ, పోల్ అఫ్ పోల్ సూచించిన విధంగా, కాంగ్రెస్, బీజేపీలకు చెరో 16-17 సీట్లు వచ్చి మేజిక్ ఫిగర్’కు ఇరు పార్టీలు సమాన దూరంలో ఉండి, మహారాష్ట్ర వాది గోమంతక్ పార్టీకి ఎగ్జిట్ పోల్ సూచించిన విధంగా 2 నుంచి 5, ఇతరులు నాలుగు స్థానాలు వరకు వస్తే, అవసరం అయితే, మాజీ మిత్ర పక్షం మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీకి, ‘తాత్కాలికం’ గా అయినా ముఖ్యమంత్రి పదవిని ఇచ్చి బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, స్థానిక విశ్లేషకులు భావిస్తున్నారు. మరో వంక ఈ ఎన్నికలలో పంజాబ్ చేజారుతున్న నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ గోవాతో పాటుగా హంగ్ అనివార్యంగా కనిపిస్తున్న, ఉత్తరాఖండ్’లోనూ పాగా వేసి పరువు నిలుపుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. చివరకి హస్తవాసి ఎలా వుందో తేలాలంటే, మరో రెండు రోజుల (మార్చి 10) వరకు ఆగక తప్పదు.


